ఏనుగుల ప్రాణాలు పోకుండా చర్యలు చేపట్టాలి…!

పార్వతీపురం, ఏనుగుల ప్రాణాలు పోకుండా చర్యలు చేపట్టాలని జనసేన పార్టీ నాయకులు కోరారు. బుధవారం జనసేన పార్టీ నాయకులు వంగల దాలి నాయుడు, అన్నాబత్తుల దుర్గాప్రసాద్, పసుపురెడ్డి పూర్ణచంద్ర ప్రసాద్ తదితరులు విలేకరులతో మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లాలో సంచరిస్తున్న ఏనుగుల్లో ఒక ఏనుగు గాయపడిందన్న సమాచారాన్ని అధికారులు, పాలకులు పరిగణలోకి తీసుకొని, తనిఖీ చేసి, నిజమైతే అవసరం మేరకు తక్షణ చికిత్స అందించాలని కోరారు. ఎందుకంటే వన్య ప్రాణుల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కాబట్టి ఏనుగుల ప్రాణాలు పోకుండా రక్షించుకోవాలన్నారు. ఇప్పటికే జిల్లాలో ఆరు ఏనుగులు మృత్యువాత పడటం బాధాకరమన్నారు. దాదాపుగా 2017లో ఒడిశా నుండి పార్వతీపురం మన్యం జిల్లాలోకి 8 ఏనుగులు ప్రవేశించాయన్నారు. అవి కురుపాం, పార్వతీపురం నియోజకవర్గాలలోని ఆయా మండలాల్లో సంచరిస్తూ… అనుకోని సంఘటనల నేపథ్యంలో దుగ్గి, కల్లికోట, అర్తాము గ్రామాల సమీపంలో మూడు ఏనుగులు మృత్యువాత పడ్డాయన్నారు. మరలా వాటి సంతతి పెరిగి ప్రస్తుతం మళ్లీ 8 కి చేరుకున్నాయన్నారు. అయితే మృత్యువాత పడిన మూడు ఏనుగులు ఒకటి నది నీటిలో పడి చనిపోగా, మరో రెండు విద్యుత్ షాక్ కు గురై చనిపోవడం విచారకరమన్నారు. ఇది ఇలా ఉండగా సీతంపేట ప్రాంతానికి వచ్చిన ఏడు ఏనుగుల్లో విద్యుత్ షాక్ కు గురై 3 ఏనుగులు మృత్యువాత పడటం బాధాకరమన్నారు. జిల్లాలో ఉన్న జిల్లాకు వచ్చిన 15 ఏనుగుల్లో ఆరు మృత్యువాత పడటం అన్యాయమన్నారు. వాటికి సరైన విధంగా రక్షణ కల్పించకపోవడం వల్లే అవి విద్యుత్ షాక్ తో పాటు వివిధ కారణాల వలన మృత్యువాత పడటం జరిగిందన్నారు. ఎందుకంటే ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో దాదాపుగా విద్యుత్ సరఫరా నిలిపివేయాల్సి ఉందన్నారు. అయినప్పటికీ అటువంటి చర్యలు చేపట్టకపోవడం వలన అవి మృతి చెందాయన్నారు. ప్రస్తుతం గాయపడిందన్న ఏనుగు కూడా విద్యుత్ షాక్ వలన గాయం అయినట్లు చర్చ జరుగుతోందన్నారు. తక్షణమే ఏనుగు గాయపడిందా…? లేదా అన్నది సంబంధిత అధికారులు తనిఖీ చేసి ఒక నిర్ణయానికి రావాలన్నారు. ఒకవేళ నిజంగా గాయపడితే తక్షణమే చికిత్సవాలన్నారు. ఇదిలా ఉండగా ప్రజలకు వన్యప్రాణులు ఏనుగుల సంరక్షణ చట్టాలు 1972, 1879 ల గురించి అవగాహన కల్పించాలన్నారు. ఒకవేళ ఎవరైనా కావాలనే ఏనుగులు చంపాలన దురుద్దేశంతో విద్యుత్ పెడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇది ఇలా ఉండగా ఇప్పటి వరకు ఏనుగులు కూడా 11 మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్నాయని, దాదాపు నాలుగు కోట్ల రూపాయలు నష్టాన్ని కలుగ జేశాయన్నారు. ఈ నేపథ్యంలో ఏనుగుల వలన ఇటు ప్రజలకు, అటు ప్రజల వలన ఏనుగుల కు ఎటువంటి ఇబ్బందులు భవిష్యత్తులో లేకుండా ఏనుగుల సమస్య పరిష్కారానికి త్వరితంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసైనికులు పాల్గొన్నారు.