వైసీపీ ఎస్సీ, ఎస్టీల రక్షణ ప్రభుత్వం కాదు భక్షక ప్రభుత్వం


• వైసీపీ హయాంలో ఎస్సీ, ఎస్టీల మీద దాడులు నిత్యకృత్యంగా మారాయి
• ఎస్సీ, ఎస్టీలకు మీరు చేసే న్యాయం ఇదేనా? కచ్చితంగా వైసీపీకి బుద్ది చెప్పి తీరుతారు
• మోపిదేవి ఘటనలో వైసీపీ గ్రామ కన్వీనర్, మహిళా ఎస్సైలపై చర్యలు తీసుకోవాలి
• ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు పెట్టాలి
• వైసీపీ గ్రామ కన్వీనర్ చేతిలో దాడికి గురైన గిరిజన మైనర్ బాలిక, మహిళలకు జనసేన రాష్ట్ర కార్యదర్శి మండలి రాజేష్ పరామర్శ

అవనిగడ్డ, దళితులకు, ఎస్టీలకు మాయ మాటలు చెప్పి వారి ఓట్లతో గెలిచిన వైసీపీ ప్రభుత్వం ఈరోజు ఆ వర్గాల మీద దాడుల్లో కొత్త రికార్డులు సృష్టిస్తోందని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మండలి రాజేష్ ఆరోపించారు. వైసీపీ ఎస్సీ, ఎస్టీల వంచక పార్టీ అని అన్నారు. వైసీపీ ఎస్సీ, ఎస్టీ భక్షక ప్రభుత్వం అని మండిపడ్డారు. బుధవారం అవనిగడ్డ నియోజకవర్గం, మోపిదేవి మండలం, కొక్కిలిగడ్డ కొత్తపాలెం గ్రామంలో వైసీపీ గ్రామ కన్వీనర్ మత్తి రాజాబాబు చేతిలో దాడికి గురైన ఎస్టీ వర్గానికి చెందిన మైనర్ బాలికతోపాటు శ్రీమతి కొమ్మ రమణ, శ్రీమతి కోనేటి పద్మలను మచిలీపట్నం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. వైసీపీ నేతతోపాటు పోలీస్ స్టేషన్లో మహిళా ఎస్సై చేసిన దాడిలో వారంతా తీవ్రంగా గాయపడ్డారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో బాధిత గిరిజనులు గ్రామంలో ఉంటే చంపేస్తారన్న భయంతో మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు యానాది సామాజిక వర్గానికి చెందిన ఆ కుటుంబాన్ని పరామర్శించి పార్టీ తరఫున అండగా ఉంటామని రాజేష్ భరోసా కల్పించారు. కొంత మొత్తం ఆర్ధిక సాయం అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. “దళితులు, గిరిజనులు, బీసీలను వేధింపుల్లో వైసీపీ ప్రభుత్వం ముందు ఉంటుందన్నారు. కోడి కత్తి కేసులో శీనుని ఐదేళ్లుగా జైల్లో పెట్టి వేధిస్తున్నారు. అతన్ని జైల్లో చంపేందుకు ప్లాన్ చేశారేమోనని సందేహాలు వస్తున్నాయి. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన డ్రైవర్ సుబ్రహ్మణ్యంని హత్యచేసి ఇంటికి పార్శిల్ చేసిన ఆ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పై బయట తిరుగుతున్నారు. వైఎస్ఆర్ హయాంలో సత్యంబాబు ఇరుక్కుపోతే, జగన్ రెడ్డి దాష్టికానికి శీను జైల్లో మగ్గిపోతున్నాడు.

• కొక్కిలిగడ్డ కొత్తపాలెం ఘటనకు క్షమాపణ చెప్పాలి
ఎస్సీ, ఎస్టీలకు మీరు చేసే న్యాయం ఇదా? ఏ ముఖం పెట్టుకుని వైసీపీ నాయకులు బస్సు యాత్రలు చేస్తారు? దళితులకు ఏం సమాదానం చెబుతారో చెప్పాలి. కొక్కిలిగడ్డ కొత్తపాలెం ఘటనకు వైసీపీ అధినాయత్వం క్షమాపణ చెప్పాలి. వైసీపీ హయాంలో దళితులపై దాష్టికాలకు ఆ దళితులే బుద్ది చెబుతారు. దళితుల మీదే ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు పెట్టిన ఘతన కూడా జగన్ రెడ్డి ప్రభుత్వానికే చెల్లింది. గత ఎన్నికల్లో అధికారం కట్టబెట్టిన వారే ఈ సారి మీకు బుద్ది చెప్పడం ఖాయం. గిరిజన మహిళల మీద దాడికి పాల్పడిన కొక్కిలిగడ్డ గ్రామ కన్వీనర్ మత్తి రాజాబాబు రౌడీ షీటర్ అని, ఊళ్ళోకి అడుగుపెడితే చంపేస్తారన్న భయం ఆ గిరిజన కుటుంబాల్లో ఉంది. ఆ యానాదుల కుటుంబానికి ఏం జరిగినా జిల్లా ఎస్పీ, స్థానిక పోలీసు యంత్రాంగం, అవనిగడ్డ శాసనసభ్యుడు బాధ్యత వహించాల్సి ఉంటుంది. బాధిత కుటుంబానికి ప్రత్యేక రక్షణ కల్పించాలి” అన్నారు. ఎస్టీ మహిళలను పరామర్శించిన వారిలో పార్టీ నేతలు మచిలీపట్టణం జనసేన పార్టీ ఇంచార్జ్ బండి రామకృష్ణ, కొరియర్ శ్రీను, సందు పవన్, వంపుగడల చౌదరి, మోపిదేవి మండలాధ్యక్షులు పూషడపు రత్నగోపాల్ తదితరులు పాల్గొన్నారు.