‘ఛత్రపతి’ హిందీ రీమేక్ లో ‘లైగర్’ భామ?

జయాపజయాలతో సంబంధం లేకుండా తెలుగులో వరుసగా భారీ సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు బాలీవుడ్ ప్రవేశం కూడా చేస్తున్న సంగతి విదితమే. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా ‘ఛత్రపతి’ని బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా హిందీలో రీమేక్ చేస్తున్నారు.

ఈ చిత్రంతో ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ కూడా బాలీవుడ్ ప్రవేశం చేస్తుండడం విశేషం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. హిందీ నేటివిటీకి తగ్గట్టుగా స్క్రిప్టుకు కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు.

ఇక ఈ చిత్రంలో నటించే కథానాయిక విషయంపై ఓ అప్ డేట్ వచ్చింది. బాలీవుడ్ భామ అనన్య పాండే కోసం ఈ చిత్ర బృందం ప్రస్తుతం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘లైగర్’ చిత్రంలో అనన్య కథానాయికగా నటిస్తున్న సంగతి విదితమే. ఈ విషయంలో త్వరలోనే ఓ క్లారిటీ వస్తుంది.