ఏకగ్రీవమని ప్రకటించేస్తే.. ఎస్‌ఇసి విచారణ చేయరాదు: హైకోర్టు

అమరావతి : జెడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో ఒకే నామినేషన్‌ వేసిన అభ్యర్థి ఏకగ్రీవంగా గెలిచినట్లుగా గతంలో ఫారం 10 ఇచ్చిన చోట్ల రాష్ట్ర ఎన్నికల సంఘం ఏవిధమైన విచారణ చేయరాదని హైకోర్టు ఆదేశించింది. ఫారం 10 జారీ చేయని చోట్ల ఎస్‌ఇసి చర్యలు తీసుకుని ఉంటే ఈ నెల 23 వరకు వెల్లడించవద్దని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ డివిఎస్‌ఎస్‌ సోమయాజులు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. దౌర్జన్యంగా నామినేషన్లను విత్‌డ్రా చేయించారని నిర్ధారణ అయినచోట్ల సదరు అభ్యర్థి నామినేషన్‌ను పునరుద్ధరించాలని జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లకు ఈ నెల 18న ఎస్‌ఇసి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది. చిత్తూరు జిల్లా సింగిరిగుంట, ఆరడిగుంట, పీలేరు ఎంపిటిసిలుగా ఎన్నికైనట్లు ఫారం 10 అందుకున్న ఏ.భాస్కర్‌రెడ్డి, డి.నంజుండప్ప, ఎటి రత్నశేఖర్‌ రెడ్డి వేర్వేరుగా హైకోర్టులో రిట్లు దాఖలు చేశారు. వాదనల తర్వాత.. ‘ఒక అభ్యర్థి గెలిచిన చోట్ల ఎస్‌ఇసి జోక్యానికి వీల్లేదని చట్టం చెబుతోందని, ఆ ఎన్నికను ప్రశ్నించాలంటే ఎలక్షన్‌ పిటిషన్‌ వేసుకోవాలని కూడా చట్టం నిర్దేశిస్తోందని, ఫిర్యాదులు వచ్చాయని ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలనే పేరుతో ఎన్నికైన స్థానాల్లో ఎస్‌ఇసి జోక్యానికి చట్టంలో ఆస్కారం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. అందుకే ఫారం 10 ఇచ్చిన చోట్ల విచారణ చేయవద్దని ఉత్తర్వులు ఇస్తున్నట్లు ప్రకటించింది.

తొలుత పిటిషనర్ల తరఫు సీనియర్‌ లాయర్‌ సివి మోహన్‌రెడ్డి, న్యాయవాదులు విఆర్‌ఎన్‌ ప్రశాంత్‌, ఎస్‌ఆర్‌వి చంద్రశేఖర్‌ వాదిస్తూ, ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికల నామినేషన్ల స్వీకరణ గత ఏడాది మార్చి 9న మొదలైందని, 14న నామినేషన్ల విత్‌డ్రాకు చివరి రోజని, ఎపి పంచాయతీ ఎన్నికల నిబంధల ప్రకారం ఒకే నామినేషన్‌ దాఖలు చేసిన వారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఫాం 10 ఇచ్చారని చెప్పారు. రాజకీయ పార్టీల నుంచి ఫిర్యాదులు వచ్చాయని, 2014 కంటే ఎక్కువ ఏకగ్రీవాలు ఉన్నాయని చెప్పి ఎస్‌ఇసి తాజాగా ఇచ్చిన ఉత్తర్వులు చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని కోరారు. ఒకసారి ఎన్నికల్లో గెలుపొందినట్లు ప్రకటించాక వివాదం ఉంటే ఎలక్షన్‌ ట్రెబ్యునల్‌లో కేసు వేసుకోవాలేగానీ, ఎస్‌ఇసి నిర్ణయించడానికి వీల్లేదన్నారు. ఎస్‌ఇసి తరఫు న్యాయవాది అశ్వినీకుమార్‌ ప్రతివాదన చేస్తూ, జిల్లా కలెక్టర్లను ఎస్‌ఇసి రిపోర్టు మాత్రమే కోరిందని, ఎదో అయిపోతుందనే ఆందోళనతో పిటిషనర్లు కోర్టుకు వచ్చారని అన్నారు. వాదనల తర్వాత హైకోర్టు.. 18న ఆదేశాలిచ్చి 20న రిపోర్టు ఇవ్వమని కోరేంత హడావుడి ఎందుకు? ఈ వ్యాజ్యాలపై విచారణ చేయదగ్గ ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. లోతుగా విచారణ చేస్తాం.. అని వ్యాఖ్యానించింది. విచారణ ఈ నెల 22కి వాయిదా పడింది.