అంగన్వాడీల సమస్యలు తీర్చాలి: గుడివాక శేషుబాబు

అవనిగడ్డ, తమ న్యాయమైన హక్కుల సాధన కోసం గడిచిన 10 రోజులుగా అంగన్వాడీ ఉద్యోగులు నిరాహార దీక్షలు చేస్తుంటే పట్టించుకోని స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు అంటూ సంబరాలు చేసుకోవడం ఎంతవరకు సమంజసం అని జనసేన పార్టీ అవనిగడ్డ మండల అధ్యక్షులు గుడివాక శేషుబాబు అన్నారు. స్థానిక ఐసిడిఎస్ కార్యాలయం వద్ద 10 రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్న అంగన్వాడీ ఉద్యోగులకు సంఘీభావం తెలిపి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శేషుబాబు మాట్లాడుతూ నాలుగేళ్లుగా అంగన్వాడీల సమస్యలను జగన్మోహనరెడ్డి పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. తెలంగాణ కంటే ఎక్కువ జీతం ఇస్తానని, సంక్షేమ పథకాలు అమలు చేస్తానని పాదయాత్ర లోనూ, ఎన్నికల ప్రచారంలోనూ అబద్ధాలు చెప్పి, అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని పోలీసు లాఠీలతో చితకబాదిన ఘటనలను ఎవరూ మరచిపోలేరని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందుకు జీతాలు పెంచమని అంగన్వాడీ ఉద్యోగులు కోరడం జగన్మోహనరెడ్డికి తప్పుగా కనిపిస్తుందా అని ప్రశ్నించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తూ క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలులో కీలకపాత్ర వహిస్తున్న అంగన్వాడీ ఉద్యోగులంటే జగన్మోహనరెడ్డికి ఎందుకంత చులకన అని ప్రశ్నించారు. అంగన్వాడీల న్యాయమైన కోరికలు తీర్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని అన్నారు. కనీస వేతన చట్టం అంగన్వాడీల విషయంలో ఎందుకు అమలుకావడం లేదని అన్నారు. ప్రజా ప్రభుత్వం, ప్రజా సంక్షేమ ప్రభుత్వం, నిత్యం ప్రజలకోసం పరితపించే ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్నారని, ప్రజలకు ఏమి న్యాయం చేసారని అన్నారు. 10 రోజులుగా మహిళలు తమ న్యాయమైన హక్కుల కోసం పోరాటాలు చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యేకి వీరి ఆకలి బాధలు వినిపించడం లేదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా మొద్దు నిద్రను వీడి అంగన్వాడీల సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు. జనసేన పార్టీ అంగన్వాడీ ఉద్యోగులకు అండగా ఉంటుందని, రానున్న రోజులలో జనసేన తెలుగుదేశం పార్టీల సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని, అంగన్వాడీలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు బొప్పన భాను, కటికల వసంత్,బచ్చు ప్రశాంత్, తుంగల నరేష్, మునిపల్లి శ్రీలక్ష్మి, కృష్ణ కుమారి, రాజ్యలక్ష్మీ, శివపార్వతి, అవినాశ్ గుడివాక రామాంజనేయులు, బచ్చు మురళి, భాస్కర్, గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.