‘ఉక్కు’పై బిజెపి మోసకారితనం: గంటా

‘నిర్దోషికి ఉరిశిక్ష విధించి మెడకు ఉరితాడు బిగించి, ఇంకా శిక్ష అమలు కాలేదు కదా ఎందుకు రాద్ధాంతం’ అన్నట్లుగా విశాఖ స్టీల్‌ ప్రయివేటీకరణపై బిజెపి వైఖరి ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శించారు. ఆదివారం తన స్వగృహంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడుతుంటే, ఏమిలేకుండా హడావుడి చేస్తున్నారని బిజెపి నేతలు మాట్లాడడం సరికాదన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను వంద శాతం ప్రయివేటీకరిస్తున్నట్లు బడ్జెట్‌లో పేర్కొన్నారని తెలిపారు. కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ 2019 అక్టోబర్‌లో పోస్కోతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎంపి విజయసాయిరెడ్డి ప్రశ్నకు సమాధానం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణపై కేంద్రం వైఖరి ఇంత స్పష్టంగా ఉన్నా, ఇంకా ఏమీ కాలేదని బిజెపి నాయకులు అనడం ప్రజలను మోసగించడమేనన్నారు. ప్రయివేటీకరణను అడ్డుకుంటామని బిజెపి నాయకులు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. బిజెపి మిత్రపక్షంగా పవన్‌ కల్యాణ్‌ ఉన్నందున స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ కాకుండా కేంద్రంపై ఒత్తిడి పెంచే బాధ్యత ఆయనపై మరింత ఎక్కువగా ఉందని అన్నారు. తన రాజీనామాపై నిర్ణయం స్పీకర్‌ చేతుల్లో ఉందని ఓ ప్రశ్నకు సమాధానంగా గంటా చెప్పారు.