భవన నిర్మాణ కార్మికుల భవిష్యత్తు హామీ యాత్ర

కాకినాడ సిటిలో, జనసేన పార్టీ కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో భవన నిర్మాణ కార్మికుల భవిష్యత్తుకు హామీ యాత్రా కార్యక్రమం అగ్రహారం సతీష్ ఆధ్వర్యంలో కరణంగారి వీధి ప్రాంతంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ శ్రేణులు మాట్లాడుతూ రెక్కడితే కానీ డొక్కాడని రంగం ఈ భవన నిర్మాణ రంగమనీ, వానాకాలంలోను, ముహూర్తాలు లేని కాలంలోను, పొయ్యిలో పిల్లే కదలని పరిస్థితి ఉంటుందనీ కానీ నేడు ఈ వైసిపి ప్రభుత్వ పుణ్యమా అని సుమారు ఐదు సంవత్సరాల నుండీ ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నామని వీరు బాధపడటం చూస్తుంటే ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మానవీయత కూడా లేదని తెలిసిందన్నారు. ఒకపక్క ప్రభుత్వ కాంట్రాక్టర్లు కొత్త టెండర్లపై చేతులెత్తేసారనీ రాష్ట్రంలో ఒక్క పారిశ్రామిక అభివృద్ధి రాక ఈ రంగం కునారిల్లుతోందన్నారు. ఒంట్లో ఓపిక ఉన్నవాళ్ళు ఒకనాటి బీహార్ కార్మికుల్లా వేరే రాష్ట్రాలకు వలస కూలీలుగా వెళ్ళుతున్నారనీ, ఓపిక లేనివాళ్ళు అలో లక్ష్మణా అని ఏడుస్తున్నారనీ ఈ ఉసురు జగన్మోహన్ రెడ్డికి తప్పక తగులుతుందన్నారు. రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికలలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీలకు మద్దతు ఇచ్చి వారి ఉమ్మడి మ్యేనిఫెస్టోలోని భవననిర్మాణ రంగ కార్మికుల సంక్షేమాన్ని పొందవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో అగ్రహారపు సతీష్, నగేష్, రాజు, చక్కారావు, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.