మునిసిపల్ ఎన్నికల ముందు రైల్వే మంత్రికి జగన్ లేఖ..

సరిగ్గా మున్సిపల్ ఎన్నికల ముందు కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ కు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాయడం సంచలనంగా మారింది. విజయవాడలో రైల్వేకి సంబంధించిన ఆక్రమిత భూ బదలాయింపు లపై ఆయన లేఖ రాసినట్లు చెబుతున్నారు. విజయవాడ రాజరాజేశ్వరి పేట లో ఎనిమిది వందల కుటుంబాలు రైల్వే స్థలాన్ని ఆక్రమించి 30 ఏళ్ల నుంచి కాపురం ఉంటున్నాయని జగన్ లేఖలో పేర్కొన్నారు.

రైల్వే శాఖకు ఉపయోగం లేని ఈ భూమి రాష్ట్రానికి బదిలీ చేయాలని జగన్ పీయూష్ గోయల్ కి రాసిన లేఖలో కోరినట్లు తెలుస్తోంది. దానికి బదులుగా అజీజ్ పేటలో పాతిక ఎకరాల రైల్వేశాఖకు ప్రభుత్వ భూమిని బదిలీ చేస్తామని లేఖలో పేర్కొన్నట్లు చెబుతున్నారు. సరిగ్గా విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా సీఎం జగన్ ఈ లేఖ రాయడం ఆసక్తికరంగా మారింది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ లేఖ రాశారని ప్రతిపక్షాల వారు ఆరోపిస్తున్నారు.