గిరిజనుల సమస్యల పరిష్కారంలో వైకాపా ప్రభుత్వం విఫలం

  • జనసేన నేత గురాన అయ్యలు

విజయనగరం: గిరిజన ప్రాంత సమస్యలు పరిష్కరించడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జనసేన నేత గురాన అయ్యలు ఆరోపించారు. ఇకనైనా పట్టించుకోకపోతే తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయనగరం జిల్లాలో శృంగవరపుకోట మండలం మూలబొడ్డవర పంచాయితీ శివారు చిట్టెంపాడుకు చెందిన మాదల గంగులు ఎదుర్కొన్న హృదయ విదారక సంఘటన తీవ్రంగా కలచివేసిందన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య పరిస్థితులకు ఈ ఘటన అద్దం పడుతోందన్నారు. రోజుల వ్యవధిలో కుమారుడుని, భార్యను కోల్పోయిన గంగులు.. తన భార్య మృతదేహాన్ని ద్విచక్రవాహనంపైన కొద్దిదూరం, డోలీపైన మరికొంతదూరం అవస్థలు పడి స్వస్థలానికి తీసుకెళ్లడం రాష్ట్రంలో మారుమూల గిరిజనులు ఎదుర్కొంటున్న పరిస్థితులను కళ్లకు కడుతోందన్నారు.
వైకాపా పాలనలో గిరిజనలకు సరైన వైద్యం అందించడం లేదని ఆరోపించారు. కనీసం మృతదేహాన్ని తరలించేందుకు కూడా ఎటువంటి రవాణా సౌకర్యం లేకపోవడం దురదృష్టకరమన్నారు. గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం లేకపోవడంతో.. ఈ డోలీ మోతలతో సకాలంలో వైద్యం అందక గిరిజనల ప్రాణాలు గాల్లో కలసి పోతున్నాయని ఆవేదనక్తం చేశారు. అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటున్న వైకాపా పాలకులు ఈ సంఘటనకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. గిరిజనులను ఓటుబ్యాంకుగా వాడుకునే వారికి రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ప్రజా సమస్యలు పట్టని వైకాపా ప్రభుత్వాన్ని మరో మూడు నెలల్లో సాగునంపుతారని మండిపడ్డారు. ఏజెన్సీ గ్రామాల్లో నిర్వహిస్తున్న మైనింగ్‌ కార్యకలాపాలు నేపథ్యంలో ప్రభుత్వానికి వచ్చే మైనింగ్‌ ఆదాయంతో గిరిజన గ్రామాలను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. అలాగే గిరిజన గ్రామాల్లో రహదారు లు, తాగునీరు, విద్యుత్‌ సౌకర్యాలు, గృహనిర్మాణం, కొండపోడు పట్టాలు వంటి సమస్యలు పరిష్కరించాలని కోరారు. గిరిజనుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.