అంగన్వాడీలపై జగన్ రెడ్డి ప్రతీకార చర్యలు దుర్మార్గం

  • అంగన్వాడీల జీవితాలు చిన్నవి.. వాటితో చెలగాటమాడటం రాష్ట్రానికి మంచిది కాదు
  • అంగన్వాడీ లను తొలగించమంటూ ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి
  • అంగన్వాడీలకు జనసేన అండగా ఉంటుంది
  • జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

ప్రతిపక్ష నేతగా ఆనాడు జగన్ రెడ్డి తమకిచ్ఛిన హామీలను నెరవేర్చమని న్యాయసమ్మతమైన రీతిలో సమ్మె చేస్తున్న అంగన్వాడీలను విధుల నుండి తొలగించమంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం అత్యంత దుర్మార్గమని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి మండిపడ్డారు. నలభై రోజులుగా కుటుంబాన్ని వదిలేసి నడి రోడ్డే నివాసంగా పోరాడుతున్న అంగన్వాడీలపై జగన్ రెడ్డి కక్షపూరితమైన చర్యలకు దిగటం శోచనీయమన్నారు. సమ్మెలో పాల్గొన్న అంగన్వాడీలను తొలగించమంటూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంగన్వాడీలవి పేద, దిగువ మధ్యతరగతి జీవితాలని, జగన్ రెడ్డి అహంభావానికి పోయి వారి జీవితాలతో చెలగాటమాడటం రాష్ట్రానికి మంచిదికాదన్నారు. తాను ఇచ్చిన హామీలను నెరవేర్చమంటే జగన్ రెడ్డికి ఎందుకు ఎక్కడలేని కోపం వస్తుందో అర్ధం కావటం లేదని విమర్శించారు. మహిళలు అన్న జాలీ, దయ కూడా లేకుండా అంగన్వాడీల జీవితాలపై ఉక్కుపాదం మోపటం జగన్ రెడ్డి శాడిజానికి పరాకాష్ట అంటూ దుయ్యబట్టారు. తమ సమస్యలను ప్రభుత్వం పెడచెవిన పెట్టడంతోనే అంగన్వాడీలు ఛలో విజయవాడ పిలుపునిచ్చారని పేర్కొన్నారు. అంగన్వాడీలపై గతంలో ఇచ్చిన ఎస్మా చట్టాన్ని, అంగన్వాడీలను విధుల నుండి తొలగిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. ఇప్పటికైనా జగన్ రెడ్డి అంగన్వాడీల సమస్యలను, డిమాండ్లను మనసుపెట్టి పరిష్కారించాలన్నారు. అంగన్వాడీలు ధైర్యాన్ని కోల్పోవద్దని వారికి జనసేన అండగా ఉంటుందని ఆళ్ళ హరి అన్నారు.