ఎప్పటికీ అమరావతే రాజధాని: సినీ నటుడు శివాజీ

అమరావతిని  ఏపీ రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రైతులు, మహిళలు 437 రోజులుగా ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, రాజధాని ప్రజల దీక్ష శిబిరానికి సినీ నటుడు శివాజీ విచ్చేశారు. రైతులకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా శివాజీని మీడియా పలకరించింది. రైతుల దీక్షపై ఆయన అభిప్రాయాలు కోరింది.

దీనిపై శివాజీ మాట్లాడుతూ, రైతుల సంకల్పం, వారి తెగువ అమరావతిని నిలబెడతాయన్న నమ్మకం తనకుందని అన్నారు. రాజధానిపై రైతుల్లో ఉన్న దృఢసంకల్పమే వారిని విజయతీరాలకు చేరుస్తుందని తెలిపారు. అమరావతి భావితరాల సొత్తు అని, దీన్ని ఎవరూ దొంగిలించలేరని స్పష్టం చేశారు.

రాజధాని రైతులను ఏపీ ప్రభుత్వం చర్చలకు పిలవకపోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని శివాజీ వ్యాఖ్యానించారు. గతంలో ఇక్కడే రాజధాని ఏర్పాటు చేయాలని అమరావతి రైతులు కోరలేదని, ప్రభుత్వం కోరిన పిమ్మట బాధ్యతగా తమ భూములు అప్పగించారని శివాజీ తెలిపారు. ఇప్పుడా భూములకు విలువలేదని అంటే అది చెల్లదని అన్నారు. అమరావతి ఎక్కడికీ పోదని, ఆ విధంగా శాసనం చేయబడిందని, ఇది శివాజీ చెబుతున్న మాట అని ఉద్ఘాటించారు. ఆ శాసనాన్ని బద్దలు కొట్టాలంటే అణుబాంబు వల్ల కూడా కాదని స్పష్టం చేశారు.

అమరావతి ఎప్పటికీ ఆంధ్రుల రాజధానే అని పేర్కొన్నారు. అమరావతి రైతులను ఎవరూ మోసం చేయలేరని, తాను చెప్పింది చెప్పినట్టు జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలని, అదే సమయంలో అమరావతి రాజధాని నిర్మాణం కూడా కొనసాగాలని ఆకాంక్షించారు.