ఏపీలో పాఠశాలలకు సెలవులంటూ న్యూస్ వైరల్.. క్లారిటీ ఇచ్చిన అధికారులు..

దేశంలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. మహారాష్ట్రలో ఈ ప్రమాదకరంగా విస్తరిస్తుంది. మిగతా రాష్ట్రాలలో కరోనా సెకండ్ వేవ్ కలకలం రేపుతోంది. ఒకపక్క ఈ మహమ్మారితో చస్తుంటే.. మరోవైపు ఫేక్ న్యూస్ వైరల్ చేస్తున్నారు కొందరు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చి ఒకటో తేదీ నుంచి నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలకు సెలవులంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. కొద్ది రోజులుగా ఈ తరహా వైరల్ అవుతున్న వార్తలపై స్పందించిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్.. ఈ అంశంపై స్పష్టత ఇస్తూ ప్రకటన విడుదల చేశారు. సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న వార్తలు ఫేక్‌ అని, వాటిని ఎవరూ నమ్మవద్దని సూచించారు. పాఠశాలలు యథావిధిగా నడుస్తాయని, అందులో ఎటువంటి సందేహం లేదని వెల్లడించారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇక ఇదే విషయంపై మంత్రి ఆదిమూలపు సురేశ్ కూడా స్పందించారు. సదరు పోస్ట్ ఫేక్ అని ఎవరు వైరల్ చేయొద్దని కోరారు. ఈ పోస్టును సోషల్ మీడియాలో షేర్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని.. ఇప్పటికే అధికారులను ఆదేశించామన్నారు. స్కూల్స్ ఎప్పట్లానే నడుస్తాయని.. అందులో ఎలాంటి సందేహం లేదని మంత్రి వెల్లడించారు. జునియర్ కళాశాలలు కూడా షెడ్యుల్ ప్రకారం నడుస్తాయని అటువంటి వార్తలను నమ్మొద్దని మంత్రి స్పష్టం చేశారు.