మెగా డీఎస్సీ పేరిట వైసీపీ దగా: డా.యుగంధర్ పొన్న

గంగాధర నెల్లూరు, మెగా డీఎస్సీ పేరిట వైసీపీ సర్కార్ యువతను నిలువునా మోసం చేసిందని జనసేన పార్టీ గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జి మరి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ యుగంధర్ పొన్న స్పష్టం చేశారు. రాష్ట్రంలో 25 వేలు నుంచి 30 వేలు వరకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే… కేవలం 6100 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పడం దారుణమన్నారు. ఎన్నికల వేళ మరోసారి నిరుద్యోగులను మోసం చేయడానికే ఈ నోటిఫికేషన్ డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా నిరుద్యోగులపై జగన్ సర్కార్ కు ప్రేమ ఉంటే ఖాళీగా ఉన్న 30వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పాద యాత్రలో, గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఈ సందర్భంగా యుగంధర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాదయాత్ర సమయంలో 23వేల పోస్టులతో మెగా డీఎస్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో తమ జీవితాలు మారిపోతాయని లక్షలాది మంది నిరుద్యోగులు వైసీపీకి ఓట్లు వేసి గెలిపించారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి నాలుగున్నరేళ్లు దాటుతున్నా ఇప్పటి వరకు ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోయింది. రోజు రోజుకు నిరుద్యోగుల్లో ఆగ్రహజ్వాలలు మిన్నంటుతున్నాయి. ఒక వైపు తల్లిదండ్రులకు భారమవుతున్నామనే బాధ… మరో వైపు వయోపరిమితి పెరిగిపోతుందనే ఆందోళన వారిలో కనబడుతోంది. కొంతమంది పొట్టకూటి కోసం దినసరి కూలీలుగా పని చేస్తున్నామని చెప్పడం బాధ కలిగించింది. తల్లిదండ్రులకు భారం కాకూడదని నిరుద్యోగులు కూలీ పనులకు వెళ్లడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టెట్ క్వాలిఫై అయినవారు దాదాపు 10 లక్షల మంది వరకు ఉన్నారు. వారందరూ డీఎస్సీ రాయడానికి సిద్ధంగా ఉన్నారు. వారిలో 30వేల మందికి ఉద్యోగాలు వస్తే దాదాపు 30వేల కుటుంబాలు బాగుపడినట్లే. ప్రభుత్వం ఇటీవల 6100 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ నోటిఫికేషన్ లో ఎస్.జి.టి. పోస్టులు 1725 మాత్రమే… అందులో ఒక్క కర్నూలు జిల్లాలోనే 1646 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. మిగతా జిల్లాల్లో అభ్యర్థుల పరిస్థితి ఏంటి..? వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కచ్చితంగా జనసేన తెలుగుదేశం ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది” అన్నారు. సుప్రీం కోర్టు తీర్పు మేరకు రాష్ట్రంలో జీవో నెంబర్ 117 రద్దు చేసి ఖాళీ ఉన్న పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి. ప్రభుత్వం తీసుకొచ్చిన అప్రెంటిషిప్ విధానం వెంటనే రద్దు చేయాలి. ప్రతి జిల్లాలో ఎస్.జి.టి. పోస్టులు కనీసం వెయ్యికి తగ్గకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.