బీసీ డిక్ల‌రేష‌న్ చ‌రిత్ర‌లో నిలిచిపోతుంది: పెంటేల బాలాజీ

చిల‌క‌లూరిపేట‌, టీడీపీ-జ‌న‌సేన ఆధ్వ‌ర్యంలో ప్ర‌క‌టించిన బీసీ డిక్లరేషన్ చ‌రిత్ర‌లో నిలిచిపోనున్న‌ద‌ని జ‌న‌సేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజీ అన్నారు. బుధ‌వారం ఆయ‌న కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌ర్ల స‌మావేశంలో మాట్లాడుతూ చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేని విధంగా బీసీల స్థితిగ‌తులు, వారి ఆర్దిక‌, సామాజిక ప‌రిస్థితులు అధ్య‌యం చేసి బీసీ డిక్ల‌రేష‌న్ ను ‘జయహో బీసీ’ సభలో ప్ర‌వేశ‌పెట్టార‌ని తెలిపారు. జగన్‌ ఐదేళ్ల పాలనలో బీసీలు ఎంతో నష్టపోయారని, వారికి మళ్లీ ఊపిరి ఇవ్వడానికి ప్రత్యేకంగా బీసీ డిక్లరేషన్‌ రూపొందించార‌ని తెలిపారు. ఈ అన్ని కులాలకు న్యాయం చేయ‌టానికి. చిన్నా పెద్దా అన్ని కులాలకు తగిన నిధులు ఇచ్చి వారిని ఆదుకోవ‌టానికి. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బీసీల‌కు స‌మ ప్రాతినిధ్యం క‌ల్పించ‌టానికి టీడీపీ-జ‌న‌సేన కూట‌మి సిద్దంగా ఉంద‌ని వెల్ల‌డించారు. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు కానున్న ప్ర‌భుత్వంలో బీసీల‌కు స‌ముచిత స్థానం క‌ల్పించ‌బ‌డుతుంద‌ని వెల్ల‌డించారు. బీసీలు బ్యాక్‌ బోన్‌ అంటూ ఉపన్యాసాలు ఇచ్చి వారి ఓట్ల‌తో అధికారం చేప‌ట్టిన జ‌గ‌న్ బీసీల‌కు చేసింది ఏమీ లేద‌ని ఆరోపించారు. బీసీ కేటగిరీల్లో 153 కులాలను గుర్తించి, 139 కార్పొరేషన్లు పెడతామన్నారని,. కేవలం 56 కార్పొరేషన్లు పెట్టి, వాటికి బడ్జెట్‌ కేటాయించకుండా, కనీసం కుర్చీలు కూడా లేకుండా చేశారని విమ‌ర్శించారు. శాశ్వత బీసీ కమిషన్‌ ఏర్పాటు చేస్తామన్నారు కానీ, ఇప్పటి వరకూ ఆ ఊసే ఎత్తలేదని మండి ప‌డ్డారు. టీడీపీ-జ‌న‌సేన కుట‌మి విజ‌యంతోనే బీసీల అభ్యున్న‌తి ఆధార‌ప‌డి ఉంద‌ని వెల్ల‌డించారు. కుట‌మి అధికారంలోకి వ‌స్తే బీసీ డిక్ల‌రేష‌న్‌లో ప్ర‌స్తావించిన విధంగా బీసీలకు తిరిగి 34 శాతం రిజర్వేషన్లు, 50 ఏళ్లకే పెన్షన్లు, ప్రత్యేక రక్షణ చట్టం, స్థానిక సంస్థల్లో 34 రిజర్వేషన్లు. జనాభా ప్రాతిపదికన బీసీ కులాలకు కార్పొరేషన్ వీటితో పాటు అనేక హామీలు నెర‌వేర‌నున్నాయ‌ని వెల్ల‌డించారు. బీసీ డిక్ల‌రేష‌న్‌లోని అన్ని అంశాల‌ను జ‌న‌సైనికులు విస్తృతంగా ఆయా వ‌ర్గాల్లోకి తీసుకువెళ్లి వారి మ‌ద్ద‌తు స‌మీక‌రించాల‌ని బాలాజీ కోరారు.