రాజధాని నగరంలో అక్రమ కట్టడాలు, హైకోర్టు సీరియస్

తెలంగాణ రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలు యధేచ్ఛగా జరుగుతున్నాయి. క్షేత్రస్థాయి సిబ్బంది చోద్యం చూస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. సాక్షాత్తూ తెలంగాణ హైకోర్టు అభిప్రాయమిది.

హైదరాబాద్ జంట నగరాల్లో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు సారించింది. భాగ్యనగరంలో యధేచ్ఛగా సాగుతోన్న అక్రమ కట్టడాలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజధాని నగరంలో ఎక్కడపడితే అక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే క్షేత్రస్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడింది. అక్రమ కట్టడాలపై తరచూ దాఖలవుతున్న పిటీషన్ల నేపధ్యంలో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఇకపై ఈ అంశంపై పిటీషన్లు దాఖలు కాకూడదని అధికారుల్ని హెచ్చరించింది. జంట నగరాల్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాల అంశంపై నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీ ను కోరింది. ఈ నివేదికలో 2019లో ఎన్ని అక్రమ నిర్మాణాల్ని గుర్తించారు, ఎవరిపై చర్యలు తీసుకున్నారనేది వివరించాలని సూచించింది. కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 15వ తేదీకు వాయిదా వేసింది.

మరోవైపు తెలంగాణ హైకోర్టు లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ల  కొరత వల్లే కేసుల విచారణలో జాప్యం జరుగుతోందని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. క్రిమినల్ కేసుల విచారణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పాత్ర కీలకమని గుర్తు చేసింది. 414 పీపీ పోస్టులకు గానూ..212 పోస్టులు భర్తీ అయ్యాయని..మిగిలిన పోస్టుల భర్తీ విషయమై చర్చలు జరుగుతున్నాయని ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టుకు వివరించారు. దాంతో సీరియస్ అయిన హైకోర్టు ఫలితాలు కావాలని స్పష్టం చేసింది. ప్రాసిక్యూషన్ కు సంబంధించి పూర్తిస్థాయి డైరెక్టర్‌ను నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రెండువారాల్లోగా ఈ అంశంపై కూడా నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ..విచారణను ఏప్రిల్ 14వ తేదీకు వాయిదా వేసింది.