ఉప్పెన చిత్ర యూనిట్‌కు బన్నీ ప్రశంసలు

గత కొన్ని రోజులుగా సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప సినిమాతో చాలా బిజీగా ఉన్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. చిన్న విరామం కూడా లేకుండా మారేడుపల్లి, టెన్ కాశీ లాంటి ప్రదేశాల్లో పుష్ప షూటింగ్ నిర్విరామంగా జరుగుతుంది. ఈ బిజీలో ఆయన ఉప్పెన సినిమా చూడలేకపోయారు. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఈ మధ్య కాలంలో ఎవరి నోట విన్నా కూడా ఉప్పెన గురించి చర్చ జరుగుతుంది. తాజాగా తమిళనాడు షెడ్యూల్ పూర్తి కావడంతో హైదరాబాద్ వచ్చిన అల్లు అర్జున్‌కు పుష్ప నిర్మాతలు రామానాయుడు స్టూడియోస్‌లో స్పెషల్ షో వేశారు.

షూటింగ్ బ్రేక్‌లో ఈ సినిమా చూసిన అల్లు అర్జున్.. చిత్ర యూనిట్ పై ప్రశంసల వర్షం కురిపించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు మెచ్చుకున్నారు. ముఖ్యంగా హీరో వైష్ణవ్ తేజ్ పర్ఫార్మెన్స్ గురించి ప్రశంసించారు. తొలి సినిమాతోనే అద్భుతమైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు అని పొగిడారు. వైష్ణవ్‌కు అద్భుతమైన డెబ్యూ దొరికింది అని తెలిపారు అల్లు అర్జున్. అలాగే హీరోయిన్ కృతి శెట్టి.. విజయ్ సేతుపతి నటన గురించి ప్రశంసించారు.

ఒక సున్నితమైన పాయింట్ తీసుకొని అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు బుచ్చిబాబు పనితీరు గురించి ప్రత్యేకంగా ప్రశంసించారు అల్లు అర్జున్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థను పొగడ్తల్లో ముంచెత్తారు బన్నీ. ఏ నిర్మాత అయినా రిస్క్ లేని కథలు చేయాలనుకుంటారు.. కానీ రిస్కు ఉంది అని తెలిసినా కూడా కథను నమ్మి మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఉప్పెన సినిమా.. కథలపై వాళ్లకున్న నమ్మకాన్ని, ధైర్యాన్ని తెలియజేస్తుందన్నారు అల్లు అర్జున్. ఓవరాల్‌గా ఉప్పెన సినిమా తనకు చాలా బాగా నచ్చిందని.. ఇలాంటి అద్భుతమైన సినిమాలు మరిన్ని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు స్టైలిష్ స్టార్. ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలోనే పుష్ప సినిమాలో నటిస్తున్నారు అల్లు అర్జున్.