ఆచార్య షెడ్యూల్ పూర్తి చేసుకున్న రాంచరణ్

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబోలో వస్తున్న ఆచార్య చిత్రంలో రామ్ చరణ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో జరుగుతోంది. కాగా, రామ్ చరణ్ పై సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. ఈ సినిమాలో ‘సిద్ద’ అనే కీలక పాత్ర పోషిస్తున్నారు రాంచరణ్. రీసెంట్ షూటింగ్ చూసేందుకు అక్కడికి వెళ్లిన మెగా కోడలు ఉపాసన సెట్స్‌పై తెగ సందడి చేసింది. ఈ షెడ్యూల్ లో పూజాహెగ్డే, రామ్‌చరణ్‌లపై ఓ పాటని మారేడుమిల్లిలో ప్రత్యేకంగా నిర్మించిన సెట్లో చిత్రీకరించారు. తాజాగా రాంచరణ్ తన 20 రోజుల మారేడుమిల్లి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నారు. ఈమేరకు రాంచరణ్, ఉపాసన ఎయిర్ పోర్ట్ లో కనిపించటంతో అభిమానులను విపరీతంగా చేరుకున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌, కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రూపొందుతున్న చిత్రానికి నిరంజన్‌రెడ్డి, రామ్‌చరణ్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. మణిశర్మ స్వరాలు సమకూరుస్తుండగా, తిరు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రం మే 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.