అభ్యర్థి లేకుండా జనసేనను గెలిపించిన ఘనత రావిపాడుది

తాడేపల్లిగూడెం, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ అభ్యర్థి లేకుండా జనసేన పార్టీని గెలిపించిన ఘనత రావిపాడుకు దక్కుతుందని ఉమ్మడి నియోజకవర్గం ఇంచార్జ్, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. పెంటపాడు మండలం రావిపాడులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి 100 మందికి పైగా జనసేనలో చేరికల నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గ్రామ ప్రజలు తనకు భారీ మెజార్టీ ఇచ్చారని ఈ గ్రామం రుణం తీర్చుకుంటానన్నారు. ముఖ్యమంత్రి జగన్ జైలుకు వెళ్లి కరడుగట్టిన నేరస్తుల్లో ఒకడిగా మారి రాష్ట్రాన్ని దోచుకునేందుకు అన్ని మార్గాలు అన్వేషిస్తున్నాడని, ఇప్పటికే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు అన్నారు. స్థానిక మంత్రి కూడా ఆయనకేమీ తీసిపోనంటూ రాజ్యమేలుతున్నాడని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.