సామాజిక సమానత్వమే బాబూ జగజ్జీవన్ రామ్ ఊపిరి: ఆళ్ళ హరి

గుంటూరు, అంటరానితన నిర్మూలన కోసం, పీడిత, తాడిత ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దళిత చిహ్నం బాబూ జగజ్జీవన్ రామ్ సామాజిక సమానవత్వమే ఊపిరిగా జీవించారని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. శుక్రవారం బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా హిందూ కాలేజీ కూడలిలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికై ఎన్నో పోరాటాలు చేసిన సంఘ సంస్కర్త జగజ్జీవన్ రామ్ అని కొనియాడారు. ఆనాడు చదువుకు దూరమై దుర్భర జీవితాన్ని గడుపుతున్న హరిజన, గిరిజన, నిమ్నజాతుల వారి కోసం తన జీవిత పర్యంతం కృషి చేసిన మహానుభావుడు జగజ్జీవన్ రామ్ అన్నారు. తన జీవితంలో ఎదురైన అవమానాలను, ఆటంకాలను విజయాలుగా మలుచుకున్న గొప్ప దేశభక్తుడు జగజ్జీవన్ రామ్ అని పేర్కొన్నారు. ఆయన నడిచిన బాట, అనుసరించిన ఆదర్శాలు, చూపిన సంస్కరణ మార్గాల స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని ఆళ్ళ హరి కోరారు. ఈ కార్యక్రమంలో షేక్ నాజర్ వలి, నండూరి స్వామి, వడ్డె సుబ్బారావు, తేజ తదితరులు పాల్గొన్నారు.