వేగుళ్ల గెలుపునకు కృషి చేయండి: చంద్రబాబు పిలుపు

కోనసీమ జిల్లా, కోనసీమ జిల్లాలో మండపేట నియోజకవర్గం టిడిపి టికెట్ గందరగోళంపై క్లారిటీ వచ్చింది. మండపేట నియోజవర్గంలో టిడిపి అభ్యర్థి వేగుళ్ళ జోగేశ్వరరావును మారుస్తున్నారన్న ప్రచారం ఓ పక్షం రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ నేపథ్యంలో అమలాపురంలోని కిమ్స్ లో టిడిపి అధినేత చంద్రబాబు వద్దకు మండపేట నియోజవర్గ జనసేన ఇన్ఛార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ, మండపేట టిడిపి అభ్యర్థి వేగుళ్ళ జోగేశ్వరరావులు శుక్రవారం కలిశారు. అక్కడ వారిద్దరితో చంద్రబాబు భేటీ అయ్యారు. అనంతరం మండపేట నుండి నాలుగోసారి మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారని చంద్రబాబు స్పష్టం చేశారు. దీనిపై పూర్తి క్లారిటీని అటు పార్టీ వర్గాలకు ఇటు ప్రజలకు చంద్రబాబు ఇచ్చారు. దీనితో ఈనెల 20న వేగుళ్ళ జోగేశ్వరరావు నామినేషను దాఖలు చేయడానికి పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారని సమాచారం. అమలాపురం కిమ్స్ లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మండపేట నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మండపేట నియోజకవర్గ తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి వేగుళ్ళ జోగేశ్వరరావు గెలుపు కు అన్ని విధాలా కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు. వేగుళ్ళ లీలాకృష్ణకు ఎన్నికల అనంతరం సముచిత స్థానం అందించే బాధ్యత తనదని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల బాధ్యతలను జనసేనపార్టీ నేత వేగుళ్ళ లీలాకృష్ణకు అప్పగిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా, ఎన్నికల్లో ఇరు పార్టీల కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని లీలాకృష్ణకు చెప్పారు.