అరబిందో ఫార్మాలో అగ్ని ప్రమాదం

సంగారెడ్డి జిల్లాలోని అరబిందో ఫార్మాలో ఆదివారం అర్థరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికులు, కార్మికులు తెలిపిన సమాచారం మేరకు.. హత్నూర మండలం గుండ్లమాచునూర్‌లో ఉన్న అరబిందో ఫార్మా తొమ్మిదో యూనిట్‌ కాలం బ్లాక్‌ వద్ద నిన్న అర్థరాత్రి 12 గంటల సమయంలో షార్ట్‌సర్క్యూట్‌ జరిగి మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగసిపడటంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలముకున్నాయి. పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్న కార్మికులంతా భయాందోళనకు గురై వెంటనే బయటకు పరుగులు తీశారు. పరిశ్రమకు సంబంధించిన ఫైరింజన్లు మంటలను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ మంటలు అదుపులోకి రాలేదని స్థానికులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఈ విషయమై పరిశ్రమ ప్రతినిధులను సంప్రదించేందుకు ప్రయత్నించినా వారు అందుబాటులోకి రాలేదని కార్మికులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.