మయూర వాహనంపై మల్లన్న విహారం

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు ఆదివారం భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు మయూర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా అలంకార మండపంలో సుగంధపుష్పాలతో అలంకరించిన మయూర వాహనంపై ఉత్సవమూర్తులను అధిష్టింపజేశారు. గంగాధర మండపం వద్ద ప్రత్యేక పూజాదికాలను నిర్వహించి క్షేత్రవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునులకు కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం తరపున ఆలయ ఈవో ఎ.వెంకటేష్‌, తిరుమల తిరుపతి దేవస్థానం తరుపున ఈవో డాక్టర్‌ కెఎ్‌స.జవహర్‌ రెడ్డి ఆదివారం సాయంత్రం పట్టువస్త్రాలు సమర్పించారు.

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ఐదవరోజు స్వామిఅమ్మవార్లు రావణవాహనంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్వామి అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు.