కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్ర భవిష్యత్తు

  • సైకో ప్రభుత్వాన్ని సాగనంపుదాం: పంతం నానాజీ

కాకినాడ: గత ఐదేళ్ల వైసిపి పాలనలో ప్రజలంతా అష్ట కష్టాలు పడ్డారని, కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్ర భవిష్యత్తు ఉందని పంతం వెంకటేశ్వరరావు (నానాజీ) అన్నారు. మంగళవారం కాకినాడ రూరల్ మూడవ డివిజన్లో టిడిపి కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి దంపతులు, కో కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబి, బిజెపి కాకినాడ పార్లమెంట్ ఇంచార్జ్ రంబాల వెంకటేశ్వరరావు లతో కలిసి ఇంటింటా ప్రచారఒ నిర్వహించారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ గత ఐదేళ్లలోని నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు ఏనాడు కనబడలేదని, రోడ్ షోలతోనే ప్రచారం సాగిస్తున్నారని, ప్రజల ముందుకు ధైర్యంగా రాలేకపోతున్నారన్నారు. దొంగ ఓట్లు, చీకటి రాజకీయాలు చేసి గెలవాలని కన్నబాబు ప్రయత్నం చేస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయన్నారు. ప్రజాక్షేత్రంలో ధైర్యంగా ముందుకు వచ్చి ఓట్లు అభ్యర్థించే ధైర్యం వైసిపి పార్టీకి లేదని, చంద్రబాబు నాయుడు, పవన్కళ్యాణ్ రూపొందించిన సూపర్ సిక్స్ పథకాలతో తాము అధికారంలోకి రావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. కూటమిని గౌరవించే ప్రతి ఒక్కరు గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ టిడిపి నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, చప్పిడి వెంకటేశ్వరరావు జనసేన, టిడిపి, బిజెపి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.