వైసీపీ నేతల మొహంలో ఓటమి ఛాయలు

  • ఫలితాలు రాకముందే చేతులెత్తేస్తున్న వైసీపీ మంత్రులు
  • ఎన్నికలకు ముందు వై నాట్ 175 అని ఇప్పుడు ఈ బేలతనం దేనికి సంకేతం
  • తమ ఓటమిని పోలీసులపైకి నెట్టడం సిగ్గుచేటు
  • టీడీపీ నేతలపై దాడులు చేసింది, వాహనాలు ద్వంసం చేసింది ఎవరు?
  • మీ అరాచాకలను టీడీపీ, జనసేన శ్రేణులు ప్రతిఘటిస్తే పోలీసుల చేతకానితనమా?
  • కారంపుడిలో సిఐ నారాయణస్వామిపై దాడి చేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలి
  • జూన్ 4 నుంచి రాష్ట్రానికి మంచిరోజులు
  • జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

గుంటూరు: సోమవారం జరిగిన ఎన్నికల్లో ఓటు వేసేందుకు ప్రజలు పెద్దఎత్తున పాల్గొనటం, ఓటర్లలో ప్రభుత్వ వ్యతిరేకత క్షేత్రస్థాయిలో కనిపించడంతో వైసీపీ నేతల మొహంలో ఓటమి ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. ఎన్నికల నిర్వహణలో పోలీసులు విఫలమయ్యారంటూ వైసీపీ మంత్రులు మాట్లాడటంపై ఆయన మండిపడ్డారు.
మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీడీపీ శ్రేణులు తమ నేతలపై దాడులు చేసారంటూ ముసలికన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు. పల్నాడు జిల్లాలో విధ్వంసకాండకు పాల్పడింది, వాహనాలను ధ్వంసం చేసింది వైకాపా నేతలు కాదా అని ప్రశ్నించారు. ప్రజలు కూటమికి మద్దతుగా నిలవడంతో తట్టుకోలేని స్థితిలో ఎన్నికల అనంతరం కూడా కారంచెడులో టీడీపీ ఆఫీసుపై దాడి చేయటం, సీఐ పై చేయి చేసుకోవటం వైకాపా అరాచకాలకు పరాకాష్ట అని ధ్వజమెత్తారు. ఐదేళ్లు మీ అరాచాకలను, దాష్టీకాలను దుర్మార్గాలను అరికట్టాల్సిన పోలీసుల చేతుల్ని అధికార మదంతో కట్టేసిన మీరు ఇప్పుడు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. పోలీసులు మీ అసాంఘిక కార్యక్రమాలకు వత్తాసు పలికితే మంచివారు లేకపోతే దుర్మార్గులా అని ప్రశ్నించారు. మీ అరాచకాలను టీడీపీ జనసేన శ్రేణులు ప్రతిఘటిస్తే పోలీసుల చేతకానితనంగా మీరు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఎన్నికలకు ముందు వై నాట్ 175 అంటూ డాంబికాలు పోయిన వైసీపీ నేతల నోటివెంట బేలతనం మాటలు వింటుంటే రానున్న ఓటమి కళ్ళముందే కదలాడుతుందని ఎద్దేవా చేశారు. ఫలితాలు రాకముందే వైసీపీ నేతలు కాడివదిలేయటంతో వైసీపీ క్యాడర్ మొత్తం నిరాశానిస్పృహల్లో మునిగిపోయిందన్నారు. జూన్ నాలుగు తరువాత ప్రజల ఆశీస్సులతో రాష్ట్రానికి మంచిరోజులు రానున్నాయని ఆళ్ళ హరి అన్నారు.