ఎపికి మద్దతివ్వకుంటే.. మాకు కష్టం వచ్చినప్పుడో..? : కెటిఆర్‌

హైదరాబాద్‌: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఉక్కు పరిరక్షణ కోసం కార్మికులు చేస్తున్న నిరసనలకు మద్దతు తెలిపినందుకు.. ‘ఎపితో నీకేంటి పని’ అని అంటున్నారని తెలంగాణ మంత్రి కెటిఆర్‌ అన్నారు. బేగంపేటలోని హరిత ప్లాజా హోటల్‌లో తెలంగాణ వికాస సమితి సదస్సులో కెటిఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎపి ప్రజలకు, విశాఖ ఉక్కు కార్మికులకు అన్యాయం జరుగుతుంటే తాము మాట్లాడకూడదా? ఆంధ్రప్రదేశ్‌ దేశంలో లేదా? అని ప్రశ్నించారు. 80 వేల మంది ఉద్యోగులను కేంద్రం రోడ్డుపై పడేసిందని అన్నారు. ఇవాళ ఉక్కు పరిశ్రమను అమ్మేందుకు చూస్తోందని, రేపు సింగరేణి, తరువాత బిహెచ్‌ఎన్‌ఎల్‌పై కూడా కన్ను పడుతుందని చెప్పారు. ఎపికి కష్టం వచ్చింది కదా.. మాకేంటి సంబంధం అని మేం నోరు మెదపకుండా ఉండలేమని అన్నారు. రేపు మాకు కష్టం వస్తే ఎవరు ఉంటారని, ఎవరికో కష్టం వచ్చింది.. నాకెందుకులే అనుకుంటే సరికాదని పేర్కొన్నారు. మొదట తాము భారతీయులమని, ఆ తరువాతే తెలంగాణ బిడ్డలమని చెప్పుకొచ్చారు. దేశంలో ఎక్కడ తప్పు జరిగినా అందరూ ఖండిచాలని చెప్పారు.