రాజధాని భూముల అక్రమాలు.. చంద్రబాబుకు సీఐడీ నోటీసులు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాసానికి ఏపీ సీఐడీ అధికారులు ఈ ఉదయం వచ్చారు. అమరావతి అసైన్డ్ భూ వ్యవహారంలో చంద్రబాబుకు నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి సీఐడీ అధికారులు వచ్చారు. భూముల అమ్మకాలు, కొనుగోళ్లపై అంశంపై బాబుకు నోటీసులు ఇచ్చారు. చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చామని సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ తెలిపారు. ఈ నెల 23న బాబు విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. చంద్రబాబుపై 120 బీ, 166, 167, 217 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సీఐడీ నోటీసులు ఇవ్వడంతో టీడీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది.