అక్కడ రూ.10 కే కడుపునిండా భోజనం!

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం రోజూ భారీ సంఖ్యలో జనాలు వస్తుంటారు. అలా రోజూ ఈ ఆస్పత్రి వద్దకు వచ్చే వేల మంది పేదవారికి ‘ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ ట్రస్ట్’ మహిళా సభ్యులు తక్కువ ధరకే భోజనం అందిస్తున్నారు. పేద వారి ఆకలి తీర్చడం కోసమే ఆ 10 మంది మహిళలు 10 రూపాయలకే భోజనం అందిస్తున్నారు.

ఈ మహిళలు కూడా సామాన్య కుటుంబీకులే. ఏడాది క్రితం ఒక ట్రస్ట్ లో సభ్యులుగా చేరి.. అక్కడ వంటలు చేయడంలో శిక్షణ తీసుకున్నారు. సేవతో కూడిన వ్యాపారాన్ని చేయాలనుకున్నారు. దీంతో వైద్యం కోసం వచ్చిన వారు తిండి కోసం పడుతున్న ఇబ్బందులు చూసి జీజీహెచ్ అస్పటల్ ఎదురుగా ఫలహారశాల పేరుతో ఓ హోటల్ ను ఏర్పాటు చేశారు. కేవలం రూ.10 లకే కడుపునిండా భోజనం పెడుతున్నారు. రోగుల కోసం ప్రత్యేకంగా జావ, మిరియాల చారు లాంటివి కూడా దొరుకుతాయి. పెరుగన్నం, పులిహోర, చికెన్‌ బిర్యానీ వంటివి వీళ్లు అందించే మెనూలో ఉంటాయి.

ఇలా రోజుకి ఈ హోటల్ లో 300 నుంచి 500 మంది ఆకలి తీర్చుకుంటున్నారు. ఈరోజుల్లో 10 రూపాయలకు టీ కూడా రావడం లేదు. అలాంటి ప్రస్తుత కాలంలో పది రూపాయలకే భోజనం అందిస్తున్న వీరిని హాస్పటల్ కి వచ్చి.. ఇక్కడ ఆకలి తీర్చుకుంటున్న వారు అన్నపూర్ణలు అని అంటున్నారు.