ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన అర్చకులను తిరిగి విధుల్లోకి తీసుకుంటున్న టీటీడీ..

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల ఆలయంలో పదవీ విరమణ చేసిన అర్చకులు తిరిగి విధుల్లో చేరేందుకు అవకాశం కల్పించింది.ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తితిదే నిర్ణయంతో ప్రధాన అర్చకులుగా రమణదీక్షితులు విధుల్లో చేరనున్నారు. ఆయనతోపాటు పలువురు అర్చకులకు కూడా అవకాశం కలగనుంది.

అర్చకుల పదవీవిరణపై మే 16, 2018లో తితిదే పాలకమండలి ఓ నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ వయస్సును నిర్ధారించి, అది దాటిన వారంతా పదవీ విరమణ చేయాల్సింది ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నలుగురు ప్రధాన అర్చకులతో పాటు మరికొంత మంది అర్చకులు పదవీ విరమణ చేశారు. తర్వాతి కాలంలోనూ అదే కొనసాగింది. అయితే, పాలక మండలి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2018లోనే అర్చకులు కోర్టును ఆశ్రయించారు. శారీరకంగా ఆరోగ్యంగా ఉన్న అర్చకులకు వయస్సు మళ్లినప్పటికీ విధుల్లోకి తీసుకోవాలని కోర్టు తీర్పు వెలువరించింది. అయితే వయోభారం కారణంగా స్వామివారి కైంకర్యాలు చేయలేరనే ఉద్దేశంతో పాలక మండలి కోర్టు తీర్పును అమలు చేయలేదు. తాజాగా దీనిని అమల్లోకి తెచ్చినట్లు సమాచారం.