తెలంగాణ విద్యా శాఖ కీలక నిర్ణయం.. మళ్లీ స్కూళ్లు ఓపెన్

తెలంగాణలోని విద్య సంస్థల్లో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ప్రభుత్వం స్కూళ్లను మూసివేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలని భావిస్తోంది. ఏప్రిల్ 8వ తేదీ నుంచి పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలని యోచిస్తున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.

కరోనా కారణంగా బంద్ అయిన స్కూళ్లు, కాలేజీలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పున:ప్రారంభమైన విషయం తెలిసిందే. అప్పటి వరకు కొనసాగిన ఆన్‌లైన్ క్లాసులు..స్కూళ్లు ప్రారంభమైన తర్వాత ప్రత్యక్ష తరగతులు నిర్వహించారు. అయితే, కరోనా వైరస్ వ్యాప్తి మరింత పెరుగుతుండటం, స్కూళ్లలో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు కరోనా బారిన పడటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మార్చి 23వ తేదీ నుంచి స్కూళ్లు, కాలేజీలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తామని పేర్కొంది. మే 17 నుంచి 26వ తేదీ వరకు పదవ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు జరగాల్సి ఉంది.

ఫైనల్ పరీక్షలకు కేవలం 35 రోజులు మాత్రమే గడువు ఉంది. విద్యార్థులకు బోధించాల్సిన సిలబస్ ఇంకా మిగిలే ఉంది. ఆన్‌లైన్ తరగతులు అర్థం కాక విద్యార్థులు తలలు పట్టుకుంటున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కనీసం పదో తరగతి విద్యార్థులకు అయినా సాధ్యమైనన్ని ఎక్కువ ప్రత్యక్ష తరగతులు జరిగేలా చూడాలని విద్యాశాఖ భావిస్తోంది. అందులో భాగంగానే ఏప్రిల్ 8వ తేదీ నుంచి ప్రత్యేక్ష తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది.