రానున్న రోజుల్లో కరోనా తీవ్రతరం: తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు

రాష్ట్రంలో రానున్న ఆరువారాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్  శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలు సహకరించకపోతే మహారాష్ట్ర పరిస్థితి రావొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. సెకండ్‌ వేవ్‌లో వైరస్‌ చాలా త్వరగా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని కోరారు.

‘‘గాలి ద్వారా కూడా కరోనా వ్యాప్తి చెందుతుంది. ప్రజలు ఇంట్లో ఉన్నా సరే మాస్కులు ధరించాలి. గతంతో పోలిస్తే వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. ఇంట్లో ఒకరికి సోకితే గంటల్లోనే మిగతా వారికి వైరస్‌ వ్యాపిస్తుంది. తెలంగాణలో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. పరిస్థితి ఇలాగే ఉంటే దవాఖానల్లో పడకల కొరత ఏర్పడుతుంది. అత్యవసరం అనుకుంటేనే బయటకు రావాలి’’ అని డీహెచ్‌ శ్రీనివాస రావు సూచించారు. కొవిడ్‌ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.