తెలంగాణలో నేడు కరోనా వ్యాక్సినేషన్ నిలిపివేత

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు(ఆదివారం) కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్లు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డా.శ్రీనివాస్ తెలిపారు. సోమవారం నుంచి టీకా వేస్తామని ఆయన అన్నారు. కాగా.. దేశంలోని పలు రాష్ట్రాలు కరోనా టీకాల కొరతతో సతమతమవుతున్నాయి. తెలంగాణలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కేంద్రం పంపుతామన్న వ్యాక్సిన్లు ఆదివారం సాయంత్రానికి గాని వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రాన్ని 30లక్షల డోసులు పంపాలని కోరగా.. గతంలో కేవలం 4.6లక్షలు మాత్రమే వచ్చాయని.. ఆదివారం మరో 2.6లక్షల డోసులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.

సెకండ్‌ డోస్‌కే ప్రాధాన్యం..

మరో పక్క వ్యాక్సిన్ల కొరత వల్ల రాష్ట్రంలో కరోనా మొదటి డోస్‌కు తాత్కాలికంగా బ్రేక్‌ వేశారు. ఇక నుంచి కొత్తవారికి టీకా వేయకూడదని వైద్య, ఆరోగ్య శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నారు. కరోనా వ్యాక్సిన్ల కొరత కారణంగా ప్రస్తుతం ఉన్న స్టాక్‌ను సెకండ్‌ డోస్‌ వారికి మాత్రమే ఇవ్వాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అవసరమైనంత మేరకు స్టాక్‌ పంపించాక మళ్లీ మొదటి డోస్‌ టీకా ప్రక్రియ ప్రారంభిస్తామని.. అప్పటివరకు ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతున్నారు.

రాష్ట్రానికి ఇప్పటి వరకు 31,38,990 వ్యాక్సిన్ డోసులు వచ్చాయి. అందులో శుక్రవారం నాటికి 28,97,90 వ్యాక్సిన్ డోసులను వినియోగించారు. అందులో 40,540 డోసులు ఆర్మీకి అందజేశారు. మరో 1.22 శాతం వ్యాక్సిన్ వృథా అయినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇక రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టీకా కోసం బారులు తీరే వారి సంఖ్య పెరుగుతోంది.