ఉచిత అంబులెన్స్‌ సేవలకు సంప్రదించండి..

అంబులెన్స్‌ వాహనదారులు అధికంగా డబ్బు డిమాండ్‌ చేస్తున్నారా? అయితే.. ఫిర్యాదు చేయండి. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.. అంటున్నారు  సైబరాబాద్‌ పోలీసులు.

ఒక వైపు కరోనా మహమ్మారి పంజా విసురుతుంటే మరోవైపు అంబులెన్స్‌ అద్దెలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సాధారణ, మధ్యతరగతుల వారు రోగం, ఆర్థిక భారం తో కొట్టుమిట్టాడుతున్న ఘటనలెన్నో కార్పొరేట్‌ కంపెనీలను కదిలించాయి. మానవతా హృదయంతో ముం దుకు వచ్చిన వారు తమ వంతు సహాయాన్ని అందించే క్రమంలో ప్రజల కోసం 12 అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ ఆదర్శ కార్యక్రమానికి వారధిగా ‘సొసైటీ ఫర్‌ సైబర్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌, సైబరాబాద్‌ పోలీసులు’ చేసిన కృషితో ప్రజలకు ఇప్పుడు ఉచిత అం బులెన్స్‌లు అందుబాటులోకి వచ్చాయి. మానవతా ధృ క్ఫథంతో ముందుకు వచ్చి తీసుకువచ్చిన ఈ 12 ఉచిత అంబులెన్స్‌ల సేవలను శనివారం సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌ గచ్చిబౌలి పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో ప్రారంభించారు. ఎవరైనా అంబులెన్స్‌ నిర్వాహకులు సాధారణ ధర కంటే అధికంగా వసూలు చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ ఉచిత అంబులెన్స్‌ సేవలను కొవిడ్‌ బారిన పడిన వారు గాని, ఇతర రోగాలతో బాధపడుతున్న వారు వినియోగించుకోవచ్చన్నారు. దీని కోసం సైబరాబాద్‌ కొవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌ నెం. 94906 17440, 94906 17431లలో సంప్రదించవచ్చని చెప్పారు.

ఈ సేవలు 24/7 అందుబాటులో ఉంటాయి.

అంబులెన్స్‌ సేవలకు అంతరాయం కలగకుండా రోగి కుటుంబ సభ్యులు రోగిని ఎక్కడికి తీసుకు వెళ్ళాలని నిర్ధారించుకున్న తర్వాత ఈ ఉచిత అంబులెన్స్‌ సేవలను పొందవచ్చన్నారు. మరికొద్ది రోజులలో మరికొన్ని ఉచిత అంబులెన్స్‌లను అందుబాటులో తెస్తామన్నారు.

ఈ అంబులెన్స్‌లను అందించిన ‘రహేజా మైండ్‌ స్పేస్‌, సలార్‌ పురియా సాత్వ నాలెజ్డ్‌ పార్క్‌, డీఎల్‌ఎఫ్‌, ఫీని క్స్‌, దివ్యశ్రీ ఒరియన్‌, అసెండాస్‌, గార్‌కార్ప్‌, వేవ్‌రాక్‌, గూగుల్‌, టీసీఎస్‌, స్టాన్‌ప్లస్‌’ సంస్థల నిర్వాహకులు, ప్రతినిధులను సీపీ సజ్జనార్‌ అభినందించారు.