టాలీవుడ్ సీనియర్ నటుడు పొట్టి వీరయ్య కన్నుమూత

టాలీవుడ్ నటుడు పొట్టి వీరయ్య తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పొట్టి వీరయ్య తన నివాసంలో కన్నుమూశారు. పొట్టి వీరయ్య భార్య మల్లిక 2008లోనే మరణించారు. వారికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. హైదరాబాదు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానం శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

పొట్టి వీరయ్య 70, 80వ దశకాల్లో అత్యధిక సంఖ్యలో సినిమాల్లో నటించారు. గజదొంగ, జగన్మోహిని, గోల నాగమ్మ, యుగంధర్ తదితర హిట్ చిత్రాల్లో నటించారు. పొట్టి వీరయ్య తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం వంటి ఇతర దక్షిణాది భాషల్లోనూ నటించారు.

తన ఎత్తు కారణంగా ఆయనకు పొట్టి వీరయ్య అనే పేరు స్థిరపడిపోయింది. ఆయన అసలు పేరు గట్టు వీరయ్య. సూర్యాపేట తాలూకా ఫణిగిరి గ్రామం ఆయన స్వస్థలం. హైస్కూల్ చదువు తర్వాత సినిమాలపై ఆసక్తితో మద్రాసు వెళ్లిన వీరయ్యకు శోభన్ బాబు దిశానిర్దేశం చేశారు. ఆయన సలహా మేరకు విఠలాచార్య వంటి దర్శకులను కలిసి సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నారు. తన కెరీర్ లో దాదాపు 500 చిత్రాల్లో నటించారు.