ఏపీలో పరీక్షలు నిర్వహిస్తున్నారు.. మీరు జోక్యం చేసుకోవాలి: ప్రధానికి రఘురామకృష్ణరాజు లేఖ

ఏపీలో పది, ఇంటర్ పరీక్షల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్న నేపథ్యంలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కరోనా వైరస్ కారణంగా మానవజాతి మునుపెన్నడూ చూడనంత సంక్షోభంలో పడిందని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో పరీక్షలను విద్యార్థి లోకం తీవ్రంగా పరిగణిస్తోందని, దీనిపై ఏపీలో ఒకింత అధిక ఆందోళన నెలకొని ఉందని తెలిపారు. ఏపీ ప్రభుత్వం బోర్డు ఎగ్జామ్స్ నిర్వహించేందుకు సిద్ధమవుతోందని, విద్యార్థుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రధాని జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తే లక్షల్లో ఉన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వైరస్ బారినపడే అవకాశాలున్నాయని, వారు వ్యాప్తికి కారకులు కావడమో, లేక వారే బలికావడమో జరుగుతుందని రఘురామ ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ సర్కారుకు ఇదేమీ కనిపిస్తున్నట్టుగా లేదని, అందుకే ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేందుకు సిద్ధమైందని ఆరోపించారు.

“ప్రధాని గారూ కరోనా కట్టడికి మీరు అవిశ్రాంతంగా కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మీరు జోక్యం చేసుకుని తీరాల్సిన అత్యంత కీలక సమయం ఇది. పత్రికాముఖంగా, వ్యక్తిగతంగా సీఎంకు ఎన్ని అభ్యర్థనలు చేసినా పట్టించుకోవడంలేదు. పరీక్షలు రద్దు చేశామనో, వాయిదా వేశామనో చెబుతూ ఎలాంటి ప్రకటన సీఎం కార్యాలయం నుంచి రావడంలేదు. ఏపీ విద్యార్థుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మీరే ఆదేశాలు ఇవ్వండి” అని తన లేఖలో కోరారు.