కేసీఆర్‌కు కరోనా నెగటివ్.. నేటి నుంచి మళ్లీ విధుల్లోకి!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేటి నుంచి మళ్లీ విధుల్లో చేరనున్నారు. ఆయనకు నిర్వహించిన రెండు పరీక్షల్లోనూ కరోనా నెగటివ్ రిపోర్టులు వచ్చాయి. ముఖ్యమంత్రి వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు నేతృత్వంలోని వైద్య బృందం నిన్న ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో ఆర్టీపీసీఆర్, యాంటిజెన్ పరీక్షలు నిర్వహించింది. ఆ రెండింటిలోనూ కరోనా లేదని నిర్ధారణ అయింది. అలాగే, రక్త పరీక్షల్లోనూ ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని తేలింది.

ముఖ్యమంత్రి పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని, కాబట్టి ఇక నుంచి విధులకు హాజరు కావొచ్చని వైద్యులు తెలిపారు. కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ గత నెల 19న కరోనా బారినపడ్డారు. అప్పటి నుంచి ఆయన ఐసోలేషన్‌లోనే ఉన్నారు. నేడు హైదరాబాద్ రానున్న సీఎం వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.