ఏపీకి వెళ్లే బస్సు సర్వీసులను నిలిపివేసిన టీఎస్‌ఆర్టీసీ!

తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే బస్సులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. ఏపీలో కర్ఫ్యూ కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇది తాత్కాలికమేనని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ తెలిపారు. ఉదయం నుండి వెళ్లే బస్సులు మధ్యాహ్నానికి చేరుకునే అవకాశం లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అదేవిధంగా తెలంగాణ నుండి ఏపీ మీదుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లే వాహనాలను సైతం నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. ఏపీ, తెలంగాణ ఇరు రాష్ట్రాల మధ్య పూర్తిగా మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపారు. ఏపీ ప్రభుత్వ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిబంధనలు వర్తించనున్నట్లు సునీల్ శర్మ ప్రకటించారు.