రైనాకు సోనూసూద్ సాయం.. కేవలం 10 నిమిషాల్లోనే ఆక్సిజన్ పంపాడు..

కరోనా సంక్షోభం వేళ ప్రముఖ నటుడు సోనూ సూద్ దాతృత్వ సేవలు అన్నీ ఇన్నీ కావు. యావత్ దేశం హృదయంలో నిలిచిపోయేలా సోనూ సూద్ తన మంచి మనసును చాటుకుంటున్నారు. తాజాగా ప్రముఖ క్రికెటర్ సురేశ్ రైనా తన బంధువు కోసం ఆక్సిజన్ అభ్యర్థించాడు. మీరట్ లో ఉంటున్న తన ఆంటీ కరోనా బారినపడ్డారని, ఆమె వయసు 65 ఏళ్లని రైనా ట్విట్టర్ లో వెల్లడించాడు. తీవ్రస్థాయిలో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో ఆమె ఆసుపత్రిపాలైందని, అయితే ఆమెకు ఆక్సిజన్ అత్యవసరం అని, సాయం చేయాలని అర్థించాడు.

దీనికి సోనూ సూద్ వెంటనే స్పందించాడు. తప్పకుండా సాయం చేస్తానని మాటిచ్చిన సోనూ… ఆ తర్వాత మరో ట్వీట్ లో 10 నిమిషాల్లో ఆక్సిజన్ సిలిండర్ వచ్చేస్తుంది భాయ్ అంటూ బదులిచ్చారు. అందుకు రైనా సంతోషం వెలిబుచ్చాడు. ‘సోనూ అన్నయ్యా, మీరు చేస్తున్న సాయానికి థాంక్యూ సో మచ్. ఇది చాలా పెద్ద సాయం. మీకు ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ రైనా ప్రతిస్పందించాడు.