పవన్ తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన బండ్ల!

పవన్ కల్యాణ్ .. బండ్ల గణేశ్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. తనని నిర్మాతగా నిలబెట్టింది పవన్ కల్యాణ్ కనుక, ఆయనకి తాను ఎప్పుడూ రుణపడి ఉంటానని గణేశ్ చెబుతూ ఉంటాడు. పవన్ తో ఆయన నిర్మించిన ‘తీన్మార్’ పరాజయం పాలైనప్పటికీ, ఆ తరువాత నిర్మించిన ‘గబ్బర్ సింగ్’ సంచలన విజయాన్ని సాధించింది. పవన్ కల్యాణ్ కెరియర్లోనే ఈ సినిమా చెప్పుకోదగినదిగా నిలిచింది. ఆ తరువాత ఎవరి ప్రాజెక్టులతో వాళ్లు బిజీ అయ్యారు. రాజకీయాలలోకి వెళ్లిన పవన్, ‘వకీల్ సాబ్’ తో రీ ఎంట్రీ ఇచ్చారు.

దాంతో పవన్ .. బండ్ల గణేశ్ కాంబినేషన్లో మరో సినిమా రానున్నట్టుగా ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే తనతో సినిమా చేస్తానని పవన్ మాట ఇచ్చారనీ, కానీ ఇంకా తాను అందుకు సంబంధించిన పనులను మొదలుపెట్టలేదని గణేశ్ అప్పుడే చెప్పాడు. ఈ నేపథ్యంలో రమేశ్ వర్మ ఒక కథతో పవన్ ను ఒప్పించాడనీ, ఆ సినిమాకి నిర్మాత గణేశ్ అనే వార్త షికారు చేస్తోంది. ఈ విషయంపై తాజాగా స్పందించిన గణేశ్, ఈ వార్తలో నిజం లేదని స్పష్టం చేశాడు. పవన్ తో సినిమా ఓకే కాగానే తానే వెల్లడి చేస్తానని అన్నాడు. గణేశ్ నుంచి త్వరలో అలాంటి ప్రకటన వస్తుందేమో చూడాలి మరి!