మెగాస్టార్ అభిమానుల దాతృత్వం.. కర్ణాటకలో ‘చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్’ ప్రారంభం

ఈ కరోనా కష్టకాలంలో ఆక్సిజన్ అందకుండా ఎవరూ చనిపోకూడదనే సంకల్పంతో.. మెగాస్టార్ చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాలలోని జిల్లాలలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్‌లను ప్రారంభించబోతున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే చిరంజీవి శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమాన్ని ఆయన వీరాభిమాని అయిన మహేష్ (కర్ణాటక – చింతామణిలో అఖిల భారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్) కర్ణాటకకు చెందిన చిరంజీవి అభిమానుల సహకారంతో ఆయన ఆధ్వర్యంలో సోమవారం ఉదయం ‘చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్’ ప్రారంభించారు. మహేష్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ ఆక్సిజన్ బ్యాంక్ గురించి చిరంజీవికి తెలిసి.. ఎంతగానో సంతోషించడమే కాకుండా.. మహేష్ బృందానికి అభినందనలు తెలియజేస్తూ ఓ వాయిస్ మెసేజ్‌ను విడుదల చేశారు.

”ఈ కోవిడ్ కష్టకాలంలో నేను తలపెట్టిన ఆక్సిజన్ బ్యాంక్ అతి త్వరలో.. అంచెలంచెలుగా ముందుకు కదులుతూ.. అవసరంలో ఉన్నవారికి అందుబాటులోకి వస్తుంది. దీనిని స్పూర్తిగా తీసుకుని మంచి మనసున్న అభిమానులు మీ మీ ప్రాంతాలలో కూడా ప్రారంభించడం నాకు చాలా చాలా సంతోషాన్ని, సంతృప్తిని కలిగిస్తుంది. మీలాంటి సామాజిక స్పృహ ఉన్న అభిమానులు ఉండటం నాకు గర్వకారణం. చాలా సంతోషంగా ఉంది. మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంట్లోని వారికి, మన అభిమానులకు.. అలాగే ఈ మంచి కార్యక్రమంలో పాల్గొని మీకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు తెలియజేయండి..” అని చిరంజీవి తెలిపారు.