18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్.. ప్రైవేటు ఆస్పత్రులకు తెలంగాణ స‌ర్కార్ అనుమతి

హైదరాబాద్: 18 ఏళ్లు పైబడిన వ్యక్తులకు కొవిడ్ టీకాలు వేసేందుకు అన్ని ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో తెలంగాణలో ప్రైవేటు కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలుగా గుర్తింపు పొందిన ప్రైవేటు ఆస్పత్రులు ఇకపై అర్హత ఉన్నవారికి వ్యాక్సిన్లు ఇవ్వొచ్చు. వ్యాక్సినేషన్‌కు ప్రైవేట్‌ దవాఖానలతో అనుసంధానం కావాలని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ జీ శ్రీనివాసరావు సూచించారు. 18 ఏండ్లు నిండిన వారు టీకా కోసం కొవిన్‌ పోర్టల్‌లో తమ పేరు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. కొవిడ్ మార్గదర్శకాలను అనుసరించి సంస్థలు, కంపెనీలు, గేటెడ్ కంపెనీల అభ్యర్థన మేరకు ప్రైవేటు ఆస్పత్రులు టీకా డ్రైవ్‌లు నిర్వహించవచ్చన్నారు. రాష్ర్టంలో రెండో డోసు వ్యాక్సినేషన్ ప్రక్రియ మంగళవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే.