గాంధీలో బ్లాక్‌ ఫంగస్‌కు శస్త్ర చికిత్సలు

కరోనా నోడల్‌ కేంద్రమైన గాంధీ దవాఖానలో శనివారం నుంచి బ్లాక్‌ ఫంగస్‌ బాధితులకు శస్త్ర చికిత్సలు చేసేందుకు ‘స్పెషల్‌ సర్జరీ డ్రైవ్‌’ చేపట్టారు. మొదటి రోజు 13 మంది బాధితులకు విజయవంతంగా ఆపరేషన్లు నిర్వహించారు. ప్రస్తుతం, దవాఖానలో 206 మంది బ్లాక్‌ ఫంగస్‌ బాధితులు చికిత్స పొందుతుండగా, పది రోజుల పాటు ప్రతిరోజు 15 నుంచి 20 మంది బాధితులకు ఆపరేషన్‌ చేయాలని ప్రణాళిక రూపొందించారు. ఇందుకు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం.రాజారావు ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ డ్రైవ్‌ కోసం ప్రత్యేకంగా ఐదు విభాగాల వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈఎన్‌టీ విభాగం హెచ్‌ఓడీ డాక్టర్‌ శోభన్‌బాబు నేతృత్వంలో ఆప్తమాలజీ, డెంటల్‌, ఈఎన్‌టీ, న్యూరో, అనస్తీషియా విభాగాల వైద్యులు ఈ ప్రత్యేక డ్రైవ్‌లో సభ్యులుగా ఉంటారని ఆయన వెల్లడించారు.

మూడో అంతస్తులోని ఈఎన్‌టీ ఆపరేషన్‌ థియేటర్‌లో ఇందుకు మూడు సర్జరీ టేబుళ్ళను, ఇతర మౌలిక వసతులు, వైద్య పరికరాలు, కావలసిన నివారణ ఔషధాలు సమకూర్చినట్టు చెప్పారు. మొదటి దశలో బ్లాక్‌ ఫంగస్‌ను గుర్తిస్తే తగిన వైద్యం అందించడం ద్వారా చికిత్స సులభం అవుతుందని, వ్యాధి బాగా ముదిరి శరీరంలోని ఇతర అవయవాలకు సోకడంతో రోగి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుందన్నారు. అందుకే బాధితులకు తప్పనిసరిగా శస్త్ర చికిత్సలు చేయాల్సిన పరిస్థితి నెలకొన్నదని సీనియర్‌ వైద్యులు అభిప్రాయం వ్యక్తం చేశారని డాక్టర్‌ రాజారావు తెలిపారు. ఇదిలా ఉంటే గాంధీని డీఎంఈ డాక్టర్‌ రమేశ్‌ రెడ్డి సందర్శించారు. శనివారం 13 మందికి శస్త్ర చికిత్సలు నిర్వహించిన వైద్యుల బృందాన్ని ఆయన అభినందించారు.