14 వైద్య కళాశాలలకు సీఎం జగన్ నేడు శంకుస్థాపన

ఏపీలో నిర్మించనున్న 14 వైద్య కళాశాలలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంలో మొత్తం 16 వైద్య కళాశాలలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో పులివెందుల, పాడేరులలో ఇప్పటికే పనులు మొదలయ్యాయి. మిగిలిన 14 కళాశాలలకు జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో నేడు శిలాఫలకాలను ఆవిష్కరించనున్నారు.

విజయనగరం, అనకాపల్లి, రాజమహేంద్రవరం, పాలకొల్లు, అమలాపురం, ఏలూరు, మచిలీపట్టణం, బాపట్ల, మార్కాపురం, పిడుగురాళ్ల, మదనపల్లి, పెనుకొండ, ఆదోని, నంద్యాలలో కొత్త కళాశాలలను నిర్మించనున్నారు. ఇందుకోసం మొత్తం రూ. 8 వేల కోట్లు వెచ్చిస్తున్నారు. 2023 చివరి నాటికి వీటి నిర్మాణం పూర్తికానుందని ప్రభుత్వం తెలిపింది.

అలాగే, నర్సింగ్ కళాశాలలను కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. వీటి ద్వారా 1,850 సీట్లు, 32 విభాగాలకు సంబంధించిన సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. ఇక, కొత్తగా నిర్మిస్తున్న ప్రతి కళాశాలలో 500 పడకలకు తగ్గకుండా అందుబాటులోకి వస్తాయని వివరించింది. ఇటీవల తలెత్తిన ఆక్సిజన్ సంక్షోభం నేపథ్యంలో నిర్మిస్తున్న ప్రతి ఆసుపత్రిలోనూ ఆక్సిజన్ ట్యాంకులు, ఉత్పత్తి కేంద్రాలను కూడా ఏర్పాటు చేయనున్నారు.