విజయ్ దేవరకొండ నిర్మాతగా మరో ప్రాజెక్టు రెడీ!

సాధారణంగా ఇండస్ట్రీలోకి హీరోలుగా అడుగుపెట్టినవారు, నిర్మాతలుగా మారడానికి కొంత సమయం తీసుకుంటారు. ఎందుకంటే సినిమాను నిర్మించడం ఒక ఎత్తు .. దానిని బిజినెస్ చేయడం మరో ఎత్తు. అందువలన బాగా నిలదొక్కుకున్నవారే ఆచితూచి అడుగేస్తుంటారు. కానీ, ఈ విషయంలో కూడా విజయ్ దేవరకొండ తనదైన దూకుడు చూపించాడు. సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకోవడానికీ .. తొలి సినిమాను పట్టాలెక్కించడానికి ఆయన ఎక్కువ సమయం తీసుకోలేదు.

తన బ్యానర్ పై ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాను నిర్మించిన విజయ్ దేవరకొండ, ప్రస్తుతం తన తమ్ముడు హీరోగా ‘పుష్పక విమానం’ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాతో దర్శకుడిగా దామోదర పరిచయమవుతున్నాడు. ఈ సినిమా షూటింగు దశలో ఉండగానే మరో సినిమాను నిర్మించడానికి విజయ్ దేవరకొండ ప్లాన్ చేసినట్టుగా చెబుతున్నారు. పృథ్వీసేన దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో అంతా నూతన నటీనటులే కనిపిస్తారట. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టాలని ఆలోచన చేస్తున్నారని అంటున్నారు.