‘సినారే’కు ఘన నివాళులు అర్పించిన సీఎం కేసీఆర్

ప్రముఖ సినీ గీత రచయిత, కవి డాక్టర్ సినారే (సింగిరెడ్డి నారాయణరెడ్డి) వర్ధంతి సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ సాహితీ సౌరభాలను విశ్వంభరతో విశ్వవ్యాపితం చేసి, తెలుగు కవితను మహన్నోత స్థాయిలో నిలిపిన జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత అని కొనియాడారు. కవిగా, రచయితగా, గేయ కావ్య కృతి కర్తగా, విద్యావేత్తగా, పరిశోధకుడిగా, సినీ గీతాల రచయితగా తెలంగాణ పద సోయగాలను తనదైన శైలిలో ఒలికించి సాహితీ ప్రస్థానాన్ని కొనసాగించిన సృజనశీలి సినారే అని కీర్తించారు.

దక్కన్ ప్రాంత ఉర్దూ, తెలుగు భాషా సాహిత్యాలను జుగల్బందీ చేసి, గజల్స్ తో అలయ్ బలయ్ తీసుకుని, తెలంగాణ గడ్డమీద గంగా జమునా తెహజీబ్ (సంస్కృతి)కి సాహితీ చిరునామాగా నిలిచారని సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. దేశీయ, అంతర్జాతీయ భాషల్లో, తెలుగు సాహితీ లోకంలో, తెలంగాణకు ఒక ప్రత్యేక స్థానాన్ని చేకూర్చిన సినారే కృషి అజరామరం అని స్తుతించారు. భాష, సాహిత్యం నిలిచి ఉన్నన్నాళ్లు ప్రజల హృదయాల్లో సినారే నిలిచి ఉంటారని పేర్కొన్నారు.