ఎపి ఎంసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల.. ఆగస్టు 19 నుంచి 25 వరకు పరీక్షలు!

ఎపి ఎంసెట్‌ నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆగస్టు 19 నుంచి 25 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఒమర్‌ జలీల్‌ వెల్లడించారు. దరఖాస్తుల స్వీకరణకు గతంలో సూచించిన తేదీలను సవరించి మరోసారి కొత్త తేదీలను ప్రకటించారు. కొత్తగా విడుదలైన నోటిఫికేషన్‌ ప్రకారం.. అపరాధ రుసుము లేకుండా జూన్‌ 30వ తేదీ వరకు ఎంసెట్‌ దరఖాస్తులను స్వీకరిస్తారని తెలిపారు. రూ.5 వేలు అపరాధ రుసుముతో జూలై 7 వరకు, రూ.10 వేలు అపరాధ రుసుముతో జూలై 14 వరకు, రూ.15 వేలు అపరాధ రుసుముతో జూలై 22 వరకు, రూ.20 వేలు అపరాధ రుసుముతో జూలై 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని అన్నారు. కరోనా నేపధ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ప్రతి సెంటర్‌నూ శానిటైజ్‌ చేస్తామని, విద్యార్ధుల మధ్య భౌతిక దూరం ఉండేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కాగా, ఐసెట్‌, ఈసెట్‌, పిజిఇసెట్‌, లాసెట్‌, ఎడ్‌సెట్‌, పిఇసెట్‌ ప్రవేశ పరీక్షలను సెప్టెంబర్‌ మొదటి, రెండో వారంలో నిర్వహించే అవకాశం ఉందని అన్నారు.