కేటీఆర్ నియోజకవర్గంలో పర్యటించనున్న షర్మిల

తెలంగాణలో కొత్త పార్టీని ఏర్పాటు చేసే దిశగా వైయస్ షర్మిల కార్యాచరణను ముమ్మరం చేశారు. వచ్చే నెలలో తన పార్టీ పేరు, జెండా, అజెండాలను ఆమె అధికారికంగా ప్రకటించనున్నారు. ఇప్పటికే పార్టీకి సంబంధించిన పలు కమిటీల ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.

మరోవైపు, తెలంగాణలో రాజన్న రాజ్యాన్ని తీసుకురావడమే తన లక్ష్యమని ప్రకటించిన ఆమె… అందుకు తగ్గట్టుగానే అడుగులు వేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కేసీఆర్ పై అవకాశం దొరికినప్పుడల్లా తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు. తద్వారా టీఆర్ఎస్ కు తామే ప్రత్యర్థులమనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ క్రమంలో ప్రజలకు దగ్గరయ్యేందుకు షర్మిల జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు తెలంగాణ మంత్రి కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్లలో ఆమె పర్యటించనున్నారు. పర్యటన సందర్భంగా పార్టీ యూత్ లీడర్ అయిన విక్రమ్ రెడ్డిని ఆమె పరామర్శించనున్నారు. అనంతరం, అల్మాస్ పూర్ లో ఇటీవల కరోనాకు బలైన కుటుంబాన్ని పరామర్శించబోతున్నారు. షర్మిల పర్యటన కోసం పార్టీ శ్రేణులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. మరోవైపు, షర్మిల పార్టీ పేరు వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అని సమాచారం. ఈ పేరు మీద కేంద్ర ఎన్నికల సంఘంలో పార్టీని రిజిస్టర్ చేసినట్టు తెలుస్తోంది.