బ్రహ్మంగారి మఠం నూతన పీఠాధిపతిగా వెంకటాద్రి స్వామి.. ముగిసిన వివాదం!

గత  కొన్నివారాలుగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వ్యవహారం ఎట్టకేలకు సుఖాంతమైంది. కొన్నాళ్ల కిందట పరమపదించిన శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి పెద్దకుమారుడు వెంకటాద్రి స్వామి బ్రహ్మంగారి మఠం నూతన పీఠాధిపతిగా అవతరించారు. వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామికి ఇద్దరు భార్యలు కాగా, పెద్ద భార్య కుమారుడే వెంకటాద్రి స్వామి. వెంకటేశ్వరస్వామి శివైక్యం చెందిన అనంతరం పీఠాధిపతి రేసులో వెంకటాద్రి వచ్చారు.

వెంకటేశ్వరస్వామి తన మొదటి భార్య మరణానంతరం ప్రకాశం జిల్లాకు చెందిన మహాలక్ష్మమ్మను పెళ్లాడారు. మహాలక్ష్మమ్మకు ఇద్దరు కుమారులు కాగా, ఆమె కూడా మాతృశ్రీ గా తనకు మఠం బాధ్యతలు అప్పగించాలని, తన పెద్ద కొడుకు మైనారిటీ తీరిన తర్వాత తాను తప్పుకుని, తన కొడుక్కి మఠం బాధ్యతలు అప్పగిస్తానంటూ తమ వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో, వెంకటాద్రి స్వామి సోదరుడు వీరభద్రయ్య కూడా పీఠం కోసం ప్రయత్నాలు షురూ చేశారు.

ఈ వ్యవహారం జటిలం కావడంతో ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇతర పీఠాధిపతులు కూడా వెంకటేశ్వరస్వామి కుటుంబ సభ్యుల మధ్య సయోధ్యకు ప్రయత్నించారు. చివరికి మైదుకూరు ఎమ్మెల్యే రఘురాంరెడ్డి, కందిమల్లయ్య పల్లి సంస్థానం ప్రజల ప్రయత్నాలతో ఈ వ్యవహారం అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో ముగిసింది.

తొలుత 12వ మఠాధిపతిగా వెంకట్రాదిస్వామి బాధ్యతలు చేపడతారు. ఉత్తరాధికారిగా ఆయన సోదరుడు వీరభద్రస్వామి వ్యవహరిస్తారు. అనంతరం మఠాధిపతిగా మహలక్ష్మమ్మ కుమారుడికి అవకాశం ఇస్తారు. దీనిపై శనివారం నాడు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.