‘చలో రాజ్‌భవన్‌’ ఉద్రిక్తంరేవంత్ రెడ్డి సహా పలువురు నేతల అరెస్ట్

Hyderabad: పెట్రోల్, డీజిల్‌ ధరల పెరుగుదలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ‘చలో రాజ్‌భవన్‌’లో ఉద్రిక్తత నెలకొంది. ఇందిరా పార్క్ వద్దకు వచ్చిన రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందిరా పార్క్ వద్ద జరిగిన సమావేశంలో ప్రసంగించిన రేవంత్ రెడ్డి.. కార్యకర్తలతో కలిసి రాజ్ భవన్ వైపు పాదయాత్రగా బయలుదేరారు. ఇదే సమయంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి అక్కడినుంచి తీసుకెళ్లారు. రేవంత్ ను అరెస్ట్ చేసే సమయంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. రేవంత్ అరెస్ట్ ను ఖండిస్తూ కాంగ్రెస్ కార్యాకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కొందరు రేవంత్ తీసుకెళ్తున్న వాహనం వెంట వెళ్లారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు మరికొందరిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. జిల్లాల్లోనూ చాలా మంది కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.