మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ లో భాగంగా చిరంజీవి డాన్స్ గురించి కొద్దిగా మీకోసం

డాన్స్ ఈ పేరు చెబితే పాల పళ్ళ పసివాడు నుండి పళ్ళు లేని ముదుసలి వరకూ అందరికీ గుర్తొచ్చే పేరు చిరంజీవి. సినీ వినీలాకాశంలో స్వయం ప్రకాశితుడై విరాజిల్లుతున్న వెండితెర మెగాస్టార్ పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి పేరు గుర్తొస్తే చాలు అభిమాని కానివారి అడుగులు కూడా స్టెప్ లు అయిపోతాయి,  అదే చిరంజీవి చిరు స్టెప్ వేస్తే అభిమానుల గుండెలు ఉప్పెన అయిపోతాయి. ఆ గ్రేస్, ఆ స్పీడ్ మ్యాచ్ చేసే వాళ్ళు ఇప్పటికీ లేరంటే అతిశయోక్తి కాదు. అందుకే ఆయన వేస్తే మాములు స్టెప్ కూడా అందంగా మారిపోయి, అద్భుతం అయిపోతుంది.  

శివ తాండవం చేసినా, వెస్ట్రన్ డాన్స్ చేసినా ఆయన శరీరంలోని ప్రతి అణువూ లయబద్ధంగా నర్తిస్తూ ఉంటే చూడడానికి మన రెండు కళ్ళు సరిపోవు. ఎంత కష్టమైన స్టెప్ అయినా ఎంతో సునాయాసంగా లయబద్ధంగా నర్తించేలా ఆయన శరీరాన్ని తీర్చిదిద్దుకున్నారు. దాని వెనక ఎంతో అంకితభావం, కఠోర శ్రమ ఉంటుంది.  

చిరంజీవి 40 సంవత్సరాల సినీ ప్రయాణంలో ఆయన ఇరవైలో ఎలా డాన్స్ చేశారో అరవైలోనూ అదే విధంగా డాన్స్ చేశారు. ఆయన 150 చిత్రం ఖైదీ నెంబర్150 లో ఒక పాటలో తన తనయుడితో  కలిసి డాన్స్ చేసి యువతను ఉర్రూతలూగించారు.

మెగాస్టార్ గా అశేష అభిమాన జనం గుండెల్లో చిరంజీవిగా నిలిచినా వర ప్రసాద్ ప్రాణం ఖరీదు కొన్ని కోట్ల అభిమానుల గుండె చప్పుడు, సినిమాల్లో రాణించాలని ఆలోచనకి పునాది రాళ్లు ఎప్పుడు పడ్డాయోగానీ, ఆయన ప్రయాణం గురించి చెప్పాలి అంటే ఇది కథ కాదు చరిత్ర, అలరించే కోతల రాయుడు, కొత్త పేట రౌడీ గా గుండెల్లో కసి విజయ కాంక్షతో ఆరని మంటలు, పున్నమి నాగు అయి అపజయాలను కాటు వేసి ఒక నకిలీ మనిషి అయి, ప్రేమ నాటకం ఆడి, తను చేస్తున్న శ్రమకి న్యాయం కావాలని దేవుడిని అడిగి, అమ్మకి ఊరికి ఇచ్చిన మాట కోసం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య లాగా శుభలేఖ రాసి, యమ కింకరుడు అయ్యి, యముడికి మొగుడు అయ్యి, అంతులేని అభిలాషతో ఆలయ శిఖరంగా ఎదిగి  ఎందరికో స్ఫూర్తిగా నిలిచి, మరెందరో హృదయాలలోనో ఖైదీ ఐయి 150 పైగా సినిమాలతో ఖైదీ నెంబర్ 150 ఐయి ఇప్పటికీ అదే స్పీడ్, అదే జోరుతో దూసుకుపోతున్న మెగా స్టార్ చిరంజీవి గారికి ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ శ్రీ టీవీ నుండి 65 వ పుట్టిన రోజు శుభాకాంక్షలు.