జ్వరం, కాళ్లనొప్పులతో క్షీణించిన ఈటల ఆరోగ్యం.. పాదయాత్రకు బ్రేక్‌

మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్‌ అస్వస్థతకు గురయ్యారు. ‘ప్రజా దీవెన యాత్ర’ పేరిట కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌ నియోజకవర్గవ్యాప్తంగా పాదయాత్ర చేపడుతున్నన విషయం తెలిసిందే. అలుపెరగకుండా పాదయాత్ర చేస్తుండడంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఈ విషయాన్ని బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి తెలిపారు. జ్వరంతోపాటు కాళ్లనొప్పులతో ఈటల బాధపడుతున్నారని చెప్పారు. పరీక్షలు వైద్యులు ఈటలకు బీపీ తగ్గిందని, షుగర్‌ లెవెల్స్‌ పెరిగాయని వివరించారు. బీపీ 90/60కి పడిపోగా ఆక్సిజన్ లెవల్స్ కూడా పడిపోయాయని, ఈ నేపథ్యంలో వైద్యుల సూచన మేరకు ఈటలను హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు.

వీణవంక మండలం కొండపాక వరకూ పాదయాత్ర కొనసాగించి శనివారం మధ్యాహ్న భోజనం ముగించిన అనంతరం బాగా నీరసించిపోయారు. వెంటనే వైద్యులు పరీక్షలు చేశారు. ఈ నేపథ్యంలో పాదయాత్రకు తాత్కాలిక విరామం ఇచ్చారని తెలుస్తోంది. అయితే పాదయాత్రను బ్రేక్‌ లేకుండా ఎండావానకు తడుస్తూ కొనసాగిస్తుండడంతో ఈటల నీరసించిపోయారని ఈటల వర్గీయులు చెబుతున్నారు. తన భర్త జ్వరం బారిన పడడంతో ఆయన బదులు ఈటల సతీమణి జమున పాదయాత్ర కొనసాగిస్తారని సమాచారం. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చర్చ నడుస్తోంది. అయితే జ్వరం తగ్గితే పాదయాత్రను ఈటల కొనసాగించే అవకాశం ఉంది. మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ అయిన తర్వాత ఈటల రాజేందర్‌ హుజురాబాద్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాబోయే ఉప ఎన్నికలో గెలుపు కోసం ఇప్పటి నుంచే ప్రచారం మొదలుపెట్టారు. అందులో భాగంగా ప్రజాదీవెన యాత్ర కొనసాగిస్తున్నారు.